బాలికల ఆరోగ్యానికి ప్రభుత్వమే రక్ష! 

Special Attention To The Health Care Of The Girls - Sakshi

విద్యార్థినులకు హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌ పంపిణీ 

మూడు దఫాలుగా అందజేత 

సాక్షి, ఇల్లెందుఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్య రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. 12 నుంచి 18 ఏళ్ల వయసులోపు బాలికలకు హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌ పంపిణీ చేస్తోంది. ఈ మేరకు మండలంలో ఉన్న 104 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు ఆరోగ్య రక్షణ కిట్లను రెండు దఫాలు పంపిణీ చేసింది. మండలం, పట్టణంలోని 1200 మంది ఆడపిల్లలకు కిట్లను అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆరోగ్య కిట్లను ప్రభుత్వం 2018–19 విద్యా సంవత్సరం నుంచి అందజేయడం ప్రారంభించింది.

ప్రతి మూడు నెలలకోసారి పంపిణీ చేయాల్సి ఉండగా ఈ విద్యాసంవత్సరంలో రెండు సార్లు పంపిణీ చేసింది. ఎన్నికల సందర్భంగా మూడో దఫా నిలిచిపోయింది. ప్రభుత్వం అందజేసిన ఆరోగ్య రక్ష కిట్లలో వివిధ కంపెనీలకు చెందిన సబ్బులు, షాంపు బాటిల్స్, పౌడర్, టూత్‌ బ్రష్, పేస్ట్, దువ్వెన, స్టిక్కర్లు, నైలాన్‌ రబ్బర్లు, రబ్బర్‌బ్యాండ్, సానిటరీ నాప్కిన్స్‌ తదిరత వస్తువులున్నాయి. ఒక్కో కిట్‌ రూ.1600 విలువ చేస్తుంది.

ఇలా ప్రతీ సంవత్సరం బాలికా ఆరోగ్య రక్ష పథకం ద్వారా ఆడపిల్లలకు కిట్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించింది. విద్యార్థినులకు అందజేసే ఆరోగ్య రక్షణ కిట్లలో నాణ్యమైన వస్తువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఆడపిల్లలకు తొలిసారి ఆరోగ్య రక్షణ కిట్స్‌ను పంపిణీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఇల్లెందు మండల విద్యాశాఖ అధికారులు దీని అమలుకు పక్కా ప్రణాళిక అడుగులు వేస్తున్నారు.  

 విద్యార్థినులు సద్వినియోగం చేసుకుంటున్నారు.. 
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యరక్ష కిట్లను విద్యార్థినులు సద్వినియోగం చేసుకుంటున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం హర్షణీయం. ఇప్పటికే రెండు దఫాలు విద్యార్థినులకు ఆరోగ్య రక్షణ కిట్స్‌ను అందజేశాం.  
–పిల్లి శ్రీనివాసరావు, ఎంఈఓ, ఇల్లెందు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top