రైల్వే గ్రీన్‌ సిగ్నల్‌! | Sakshi
Sakshi News home page

రైల్వే గ్రీన్‌ సిగ్నల్‌!

Published Thu, Jun 18 2020 10:15 AM

South Central Railway Green Signal For Covid Care Trains - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎట్టకేలకు కోవిడ్‌ కేర్‌ బోగీలఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కరోనా ఉధృతి దృష్ట్యా వైద్య సేవల కోసం ఈ బోగీలను అందజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైల్వేశాఖ తాజాగా 60 కోవిడ్‌ కేర్‌ బోగీలను కేటాయించింది. సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్‌ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు.. ఒక్కో బోగీలో సుమారు 16 పడకల చొప్పున మొత్తం  960 పడకలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలను ఆదుకునేందుకుకేంద్రం చేపట్టిన సహాయ కార్యక్రమాల్లో భాగంగాఈ  బోగీలను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రభుత్వాల కోరిక మేరకు కోవిడ్‌ కేర్‌ బోగీలను కేటాయించారు.

అవసరమైతే మరిన్ని బోగీలను అందజేసేందుకు
కూడా దక్షిణమధ్య రైల్వే సిద్ధంగా ఉంది. మొత్తం 481 బోగీలను కరోనా పేషెంట్ల కోసం వినియోగించేందుకు వీలుగా లాలాగూడ వర్క్‌షాప్‌లో మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. స్లీపర్‌ క్లాస్‌ బోగీలను మాత్రమే ఇందుకోసం వినియోగించారు. ఇప్పటి వరకు కేవలం వర్క్‌షాప్‌నకే పరిమితమై ఉన్న ఈ బోగీలను తాజాఉత్తర్వులతో పట్టాలెక్కించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా వీటిని సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్‌ స్టేషన్లలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్ల రాకపోకలు సాగిస్తున్న ప్రస్తుత తరుణంలో కోవిడ్‌ కేర్‌ బోగీలను ఏర్పాటు చేయడం ఎలాసాధ్యమనేది చర్చనీయాంశంగా మారింది. 

సికింద్రాబాద్‌లో కష్టమే..
లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం ప్రయాణికుల రాకపోకల కోసం సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ప్రతిరోజు సుమారు 25 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 10 రెగ్యులర్‌ రైళ్లు, మరో సికింద్రాబాద్‌–న్యూఢిల్లీ వీక్లీ స్పెషల్‌ ట్రైన్లు ఇక్కడి నుంచే బయలుదేరుతున్నాయి. దీంతో పాటు నాంపల్లి స్టేషన్‌ను కూడా ప్రయాణికుల రాకపోకల కోసం వినియోగిస్తున్నారు. ప్రత్యేక రైళ్లతో పాటు శ్రామిక్‌ రైళ్లు కూడా ఈ రెండు స్టేషన్ల నుంచి బయలుదేరుతున్నాయి. మొత్తం 10 ప్లాట్‌ఫాముల్లో ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఒకటి, పదో నంబర్‌ ప్లాట్‌ఫాముల్లో నుంచి ప్రయాణికుల రాకపోకలు సాగుతున్నాయి. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఈ రెండు స్టేషన్ల నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి.  కానీ ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ స్టేషన్లోనే కోవిడ్‌ కేర్‌ బోగీలను ఏర్పాటు చేస్తే సాధారణ ప్రయాణికులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పాజిటివ్‌ లక్షణాలు ఉన్న వారిని అనుమానితులను కోవిడ్‌ కేర్‌ బోగీల్లో ఉంచేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. అలాంటి బోగీలు ఉండే స్టేషన్‌ నుంచి ప్రయాణికులు రాకపోకలు కొనసాగించడం వల్ల మరింత మందికి కరోనా సోకే అవకాశం ఉంది.  

కాచిగూడ ఓకే..
ప్రస్తుతానికి నగరంలో కాచిగూడ స్టేషన్‌ ఒక్కటి మాత్రమే కోవిడ్‌ కేర్‌ బోగీల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ స్టేషన్‌ నుంచి ఇప్పటి వరకు ప్రయాణికుల రాకపోకలు తిరిగి ప్రారంభించకపోవడం వల్ల దీనిని కోవిడ్‌ సేవల కోసం వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు ఆదిలాబాద్‌లోనూ ఏర్పాటు చేయవచ్చన్నారు. కోవిడ్‌ బోగీలను ఏర్పాటు చేయడమంటే పేషెంట్లు లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌ ఉండాలి. అలాగే తాగునీటి సదుపాయం, పారిశుధ్య వసతి అందుబాటులో ఉండాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని కోవిడ్‌ బోగీల ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నాం.’ అని చెప్పారు.   

ఏర్పాట్లు ఇలా..
పేషెంట్లకు పడకలు, నీరు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలను దక్షిణమధ్య రైల్వే కల్పిస్తుంది. అలాగే కోచ్‌ల నిర్వహణకు లైజన్‌ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేస్తారు. వైద్య సేవలు, డాక్టర్లు, మందులు, వైద్యసిబ్బంది తదితర రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement