అసంపూర్తిగా అంగన్‌వాడీ భవనాలు

 situation in Anganwadi centers has become worse - Sakshi

నెరవేరని ఐసీడీఎస్‌ లక్ష్యం

కొన్నిచోట్ల నిధులు విడుదలైనా పనుల్లో జాప్యం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అనేక అంగన్‌వాడీ కేంద్రాలు సొంత భవనాలు లేక అరకొర వసతులు, అద్దె భవనాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో కొన్ని అద్దె భవనాల్లో, మరికొన్ని ప్రాథమిక పాఠశాలల్లో, కొన్ని శాశ్వత భవనాల్లో నడుస్తున్నాయి. అయితే ఆశించిన మేర సొంత భవనాలు లేక ఐసీడీఎస్‌ లక్ష్యం నీరుగారుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. సొంత భవనాలు, అదిరిపోయే హంగులతో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా అంగన్‌వాడీ కేంద్రాలు ఉండాలని ఉండాలని ఆ శాఖ నిర్ణయించినప్పటికి అమలుకు నోచుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, బడ్జెట్‌లోపం వెరసి అంగన్‌వాడీలు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి.

నిధులు రావు.. పనులు కావు
సిరిసిల్ల జిల్లాలో రెండు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద 587 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వేములవాడ పరిధిలో 40 భవనాలు ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయా యి. వీటిని ప్రారంభించి రెండేళ్లయినా నిర్మా ణాలు పూర్తి కాలేదని పలువురు వాపోతున్నారు. సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్, హుస్నాబాద్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,150 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో సొంతభవనా ల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు 298 ఉండగా, 422 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 368 అంగన్‌వాడీ కేంద్రాలు, 430 కేంద్రాలను అద్దె లేకుండా జీపీలు, కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో తరచూ సమస్యలు తలెత్తుతుండడంతో అంగన్‌వాడీలు నడపలేకపోతున్నారు.   

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
అంగన్‌వాడీ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎంజీ నరేగా, రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌ఐడీఎఫ్‌), ఏపీఐపీల ద్వారా నిధులు కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిషత్‌ ఫండ్‌ నుంచి 15 శాతం, మండల పరిషత్‌ ఫండ్‌ నుంచి 15 శాతం తీర్మానాలు చేసి పరిమిత బిల్డింగ్‌లకు కేటాయిస్తుంటారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో రాష్ట్ర పరిధిలోని పంచాయతీరాజ్‌ ఏఈలు నిర్మాణ పనులు చేపడతారు.

కొన్ని సందర్భాల్లో నిధులు విడుదలైనప్పటికీ అధికారుల అలసత్వం, నిధుల దుర్వినియోగంతో భవన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని మధ్యలోనే ఆగిపోతున్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు. కాగా, అంగన్‌వాడీ కేంద్రాలకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ విజయేందిర బోయి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top