ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తేయాలి | should be remove suspension on MLAs | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తేయాలి

Nov 18 2014 3:39 AM | Updated on Sep 18 2018 8:28 PM

టీడీపీ శాసనసభ్యులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని....

 ఆర్మూర్ : టీడీపీ శాసనసభ్యులపై వెంటనే స స్పెన్షన్ ఎత్తివేయాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ డిమాండ్ చేశారు. ఆమె సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఓ వైపు విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వాస్తవ పరిస్థితులతో పాటు సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో అర్థం కావడం లేదన్నారు.

ఈ విషయమై అసెంబ్లీలో టీడీపీ ప్రశ్నిస్తోందని, దీంతో సభలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో వృద్ధులు, వికలాంగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. అధికారంలోకి రాగానే ‘మన ఊరు మన ప్రణాళిక’ పేరుతో సమస్యలు తెలుసుకున్నారని, వాటి పరిష్కారానికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించామని అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు.

 ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీకి రూ. 20 కోట్లు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలోనూ రూ. 20 కోట్లే కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్, సరఫరాపై శ్వేత పత్రం విడుదల చేసి ప్రజలకు నిజానిజాలు తెలియజేశారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ కోతలు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రజలకు స్పష్టతనివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 టీడీపీ సభ్యత్వం..
 అన్నపూర్ణమ్మ ఆన్‌లైన్ పద్ధతిలో టీడీపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల సుధాకర్, కౌన్సిలర్ జీవీ నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు కిషోర్‌రెడ్డి, నాయకులు జితేందర్‌రెడ్డి, గుండెం రమేశ్, పసుపుల రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement