మరో 25 వేల మందికి రుణమాఫీ!

సీఎంకు ఫైల్‌ పంపించిన వ్యవసాయశాఖ

సీఎం ఆమోదించగానే రూ.160కోట్లు విడుదలయ్యే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: కొన్ని కారణాల వల్ల రుణమాఫీకి నోచుకోని రైతులందరికీ ఇప్పుడు దాన్ని వర్తింప చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఫైలును వ్యవసాయశాఖ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆమోదానికి పంపించింది. మొత్తం 25 వేల మందికి పైగా రైతులకు రూ.160 కోట్లు రుణమాఫీ కానుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక 35.33 లక్షల మంది రైతుల రూ.16,124 కోట్ల రుణాలను నాలుగు విడతలుగా బ్యాంకులకు చెల్లించింది.

అయితే రుణమాఫీకి అర్హులను గుర్తించే క్రమంలో బ్యాంకులు కొందరు రైతుల వివరాల జాబితాను ప్రభుత్వానికి పంపించలేదు. అలా 25 వేల మందికి పైగా రైతులు అర్హులై ఉండి రుణమాఫీకి నోచుకోలేక పోయారు. వీరికి కూడా రుణమాఫీ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించిన మేరకు ఆ శాఖ అధికారులు శుక్రవారం ముఖ్యమంత్రికి ఫైలు పంపించారు. సీఎం ఆమోదించగానే ఆ రైతులందరికీ రుణమాఫీ జరగనుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top