సమ్మె ఉధృతం.. పరిస్థితి ఉద్రిక్తం | Rtc buses strike | Sakshi
Sakshi News home page

సమ్మె ఉధృతం.. పరిస్థితి ఉద్రిక్తం

May 10 2015 11:44 PM | Updated on Mar 18 2019 8:51 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆదివారం పరిగిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

పోలీసులు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట
పరస్పర వాగ్వాదం.. యూనియన్ నాయకుల అరెస్టుకు విఫలయత్నం
సమ్మెకు కాంగ్రెస్, జేఏసీ నాయకుల మద్దతు
ప్రభుత్వంపై మండిపాటు  

 
పరిగి : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆదివారం పరిగిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయా యూనియన్ల నాయకులు స్పష్టం చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారితో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల ని డిమాండ్ చేశారు.ఐదో రోజు సమ్మెలో భాగంగా పరిగిలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో బస్సులు నడవకుండా అడ్డుకున్నారు.

ఇతర డిపోల నుంచి వచ్చిన బస్సులను సైతం అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బస్సులు వెళ్లాలంటూ పోలీసులు, అడ్డుకునేందుకు ఆర్టీసీ కార్మికులు పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఓ క్రమంలో ఆర్టీసీ యూనియన్ నాయకులను అరెస్టుకు పోలీసులు విఫల యత్నం చేశారు. టీఎంయూ పరిగి డిపో అధ్యక్షుడు ప్రసాద్‌ను పోలీసులు ఎత్తి జీపులో పడేశారు.

ఉద్యోగులు ఆయనను తిరిగి వాహనం నుంచి కిందికి దించారు. ఈ క్రమంలో కార్మికులుపోలీసులు, ప్రభుత్వం, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి బస్‌డిపో ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. సీఎ కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, మహేందర్‌రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు వారికి మద్దతు ప్రకటించారు. జేఏసీ నాయకుడు నాగేశ్వర్ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు.

ఎస్‌ఐలు కృష్ణ, షేక్‌శంషోద్దీన్‌లు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇతర ఠాణాల నుంచి అదనపు పోలీసులను రప్పించారు. కార్యక్రమంలో ఈయూ, టీఎంయూ, టీఎన్‌ఎంయూ నాయకులు ఎస్‌జేఎం రెడ్డి, ప్రసాద్, వెంకట్‌రాములు, సిద్దిక్, మల్లయ్య, జీపీ రెడ్డి, రాకేష్, ప్రసాద్, సురేష్,  వీఎన్‌గౌడ్, నిరంజన్, వెంకన్న, స్వామి, యాకూబ్‌అలీ, కేఆర్ చారి, బందెయ్య, అంజయ్య, ఖాజాఖుదుద్దీన్, ఎండీ బాసిద్, సుధాకర్, రవికుమార్, రత్నయ్య, ఎల్లమ్మ, పార్వతమ్మ, జయమ్మ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement