ఇక కరెంటుకూ బ్యాంకులు

ఇక కరెంటుకూ బ్యాంకులు


* సౌర విద్యుత్ వినియోగదారులకు ఎనర్జీ బ్యాంకింగ్ సౌకర్యం

* విద్యుత్‌ను ‘డిస్కం’లకు ఇచ్చి అవసరమైనప్పుడు తిరిగి పొందవచ్చు

* సౌర విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించేందుకు వినూత్న ప్రయత్నం


సాక్షి, హైదరాబాద్: రాము తన రూఫ్‌టాప్ సోలార్ సిస్టం ద్వారా 500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాడు. సొంత వినియోగం పోగా 100 యూనిట్లను ‘ఎనర్జీ బ్యాంకు’లో జమ చేశాడు.మరుసటి నెలలో అవసరాలు పెరగడంతో ఎనర్జీ సేవింగ్స్ నుంచి 50 యూనిట్లను డ్రా చేసి వాడుకున్నాడు. సమీప భవిష్యత్తులో మనం ఇలాంటి ఘటనలను చూడబోతున్నాం. సంపాదనలో మిగులు డబ్బును బ్యాంకులో జమ చేసి అవసరమైనప్పుడు వినియోగించుకుంటున్నట్లే విద్యుత్‌ను సైతం దాచిపెట్టి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ఉత్పాదకతను పెంపొందించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఈ వినూత్న సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సరళీకృత విధానాలు, భారీ రాయితీలు, ప్రోత్సాహకాలతో డిస్కంలు ‘తెలంగాణ సౌర విద్యుత్ విధానం’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సౌర విద్యుత్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టిన ‘విద్యుచ్ఛక్తి బ్యాంకింగ్’ సదుపాయం అందరినీ ఆకర్షిస్తోంది. సొంత వినియోగం(కాప్టివ్), ఓపెన్ యాక్సెస్ (బహిరంగ విక్రయం), షెడ్యూల్డ్ కేటగిరీల వినియోగదారులకు ఏడాదిలో 12 నెలల పాటు ఈ సౌలభ్యం అందుబాటులో ఉండనుంది. స్వీయ వినియోగం/ప్రైవేటు సంస్థలకు విక్రయ డిమాండు తగ్గిపోయినా సౌర విద్యుత్ ప్రాజెక్టులు నిరాటంకంగా ఉత్పత్తిని కొనసాగించవచ్చు.ఉత్పాదనలో 100 శాతం విద్యుత్‌ను ఎనర్జీ బ్యాంక్‌లో దాచుకోవచ్చు. సౌర విద్యుత్ ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడి పెట్టిన వినియోగదారులు నష్టపోకుండా డిస్కంలు ఈ వినూత్న సదుపాయాన్ని కల్పించాయి. దీనికి ప్రతిఫలంగా కేవలం 2 శాతం బ్యాంకింగ్ చార్జీలను వసూలు చేస్తాయి.  ఏప్రిల్ నుంచి మార్చివరకు బ్యాంకింగ్ సంవత్సరంగా పరిగణిస్తారు.వినియోగదారులు ‘ఎనర్జీ బ్యాంకు’ నుంచి విద్యుత్‌ను తిరిగి పొందని పక్షంలో డిస్కంలు ఆ విద్యుత్‌ను తామే కొనుగోలు చేసినట్లు పరిగణిస్తాయి. విద్యుత్ నియంత్రణ సంస్థ నిర్ణయించిన సగటు విద్యుత్ కొనుగోలు ధర ప్రకారం వినియోగదారులకు డబ్బులు చెల్లిస్తాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి థర్డ్ పార్టీ కొనుగోలుదారుడు లభించే వరకు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సైతం ఎనర్జీ బ్యాంకులో నిల్వ చేసుకోవచ్చు.

 

ఎనర్జీ బ్యాంక్ అంటే

స్వభావరీత్యా విద్యుత్ నిల్వ ఉండదు. ఉత్పత్తి చేసిన వెంటనే వినియోగించుకోవాల్సిందే. అప్పటికప్పుడు వినియోగించునే అవకాశం లేనప్పుడు (డిస్కంలకు) ఎనర్జీ బ్యాంకుకు ఇవ్వవచ్చు. ఆ విద్యుత్‌ను డిస్కంలు తమ వినియోగదారులకు సరఫరా చేస్తాయి. దీనికి బదులుగా అవసరమైనప్పుడు డిస్కంలు సౌర వినియోగదారులకు విద్యుత్‌ను ఇస్తాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top