అడగనివారికి రిజర్వేషన్లా?: ఆర్‌.కృష్ణయ్య

Reservation for those backward in the upper castes - Sakshi

హైదరాబాద్‌: అగ్రకులాల్లో వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించడంపై బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు. అడగని వాళ్లకు, అవసరం లేని వారికి రిజర్వేషన్లు కల్పించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 9 శాతం జనాభా ఉన్న అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో ఆంతర్యమేంటని నిలదీశారు. అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం నేతృత్వంలో దాదాపు వంద మంది బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రధాన రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.

ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 30 మంది సీఎంలు అయితే ఒక్కరు కూడా బీసీ కులాలకు చెందిన వారు లేరన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్‌లు కూడా అగ్రకులాలకు చెందిన వారే ఉన్నారు కానీ.. బీసీలు లేరన్నారు. ఆఖరికి బ్యాంక్‌ చైర్మన్‌లు, ప్రభుత్వ రంగ చైర్మన్‌ల పదవుల్లో కూడా అగ్రకులాల వారే ఉన్నారని ధ్వజమెత్తారు. 80 శాతం కీలక పదవులను అనుభవిస్తున్న అగ్రకులాలకు చెందిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో అర్థం ఉందా అని నిలదీశారు. బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top