జొన్న విత్తు.. రికార్డు సొత్తు

Record of Icrisat fodder seed - Sakshi

ఇక్రిశాట్‌ పశుగ్రాస వంగడం రికార్డు! 

సాక్షి, హైదరాబాద్‌: ఇక్రిశాట్‌ సహకారంతో అభివృద్ధి చేసిన జొన్నపంట దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. పాడి రైతులకు చౌకగా పశుగ్రాసం అందించేందుకు నమూనా వంగడంగా జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం దీన్ని గుర్తించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌), ఉత్తరాఖండ్‌లోని జీబీ పంత్‌ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం జన్యు వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఇక్రిశాట్‌ వంగడం ఐసీఎస్‌ఏ 467, పంత్‌ చారి–6 రకాల వంగడాలు రెండింటినీ కలిపి సీఎస్‌హెచ్‌ 24 ఎంఎఫ్‌ పేరుతో దీన్ని అభివృద్ధి చేశారు. జొన్న చొప్పను పలుమార్లు కత్తిరించి వాడుకునే అవకాశముండటం దీని ప్రత్యేకత. అతితక్కువ నీటితోనే ఎక్కువ గ్రాసాన్ని ఇవ్వగలదు.

వేసవిలో నీటి ఎద్దడి ఉన్నప్పుడు కూడా పశువులకు తగినంత పచ్చి ఆహారాన్ని అందించవచ్చని దీన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త డాక్టర్‌ అశోక్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే దీనిని దేశవ్యాప్తంగా పలువురు రైతులు విజయవంతంగా వాడుతున్నారని చెప్పారు. ఈ పంట కేవలం పశుగ్రాసం కోసం మాత్రమే వాడతారని, జొన్న గింజలు రాకమునుపే కత్తిరించేస్తారని ఆయన స్పష్టం చేశారు.

జొన్న పంటపై చేపట్టిన జాతీయ కార్యక్రమంలో దీనికి ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. కొత్త హైబ్రిడ్‌ జొన్న వంగడాలు తయారు చేయాలంటే.. సీఎస్‌హెచ్‌–24ఎంఎఫ్‌ను నమూనాగా ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్దేశించారు. దీనికి ఉన్న డిమాండ్‌ ఎంత అంటే.. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఏటా 10 నుంచి 12 కొత్త కంపెనీలకు గ్రాసం విత్తనాల సాగుకు లైసెన్స్‌ ఇచ్చేంత! పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారత్‌ను పశుగ్రాసం కొరత చాలా తీవ్రంగా వేధిస్తోంది. ఓ అంచనా ప్రకారం దేశంలో ఏటా దాదాపు 132.57 కోట్ల టన్నుల పశుగ్రాసం (పచ్చి, ఎండు) అవసరముండగా.. 35 శాతం తక్కువగా కేవలం 97.87 కోట్ల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. తాజా వంగడంతో పశుగ్రాసం కొరత తీరనుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top