జులై 1 నుంచి రేషన్‌ డీలర్ల నిరవధిక సమ్మె  | Sakshi
Sakshi News home page

Published Wed, May 30 2018 1:12 PM

Ration Dealers Strike From July 1st 2018 - Sakshi

పంజగుట్ట : రేషన్‌ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ జులై 1వ తేదీ నుండి రేషన్‌ డీలర్లు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐక్య రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ప్రకటించింది. నిరవధిక సమ్మె పోస్టర్‌ను  మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం అధ్యక్షులు నాయకోటి రాజు, ఆల్‌ ఇండియా రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు దాసరి మల్లేశం, తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కాచం కృష్ణమూర్తి, బత్తుల రమేష్‌లు ఆవిష్కరించారు.

నాలుగు సంవత్సరాలుగా రేషన్‌ డలలర్లను ప్రభుత్వం ఆదుకుంటుందని వేచి చూశామని, ఇతర వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం తమను మాత్రం విస్మరించిందని ఆవేదనవ్యక్తం చేశారు. 2015 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం తమకు రావల్సిన కమీషన్‌ ’ 400 కోట్లు విడుదల చేసి ప్రభుత్వ ఖాతాలో జమచేసిందని, తమకు రావాల్సిన కమీషన్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వకుండా తాత్కారం చేస్తుందని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇదే విషయంపై సంబంధిత శాఖా మంత్రికి, సివిల్‌సప్‌లై కమీషనర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితంలేకుండా పోయిందన్నారు. కమీషనర్‌ ప్రభుత్వ మెప్పు పొందేందుకు తమకు కోతలు విధిస్తున్నారని ఆరోపిచారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈపాస్‌ మిషన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకించడంలేదని, కాని కేవలం 20 పైసల కమీషన్‌ ఇవ్వడంవల్ల షాపునిర్వహణ, అద్దె, విద్యుత్‌బిల్లు చెల్లించుకోలేకపోతున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,200 మంది రేషన్‌డీలర్లు ఉన్నారని, వారి భవిష్యత్తుగూర్చి ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 31వ తేదీన హయత్‌నగర్‌లోని లక్ష్మీరెడ్డిపాలెంలో డీలర్లు, వారి కుటుంబ సభ్యులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు.   

Advertisement
Advertisement