రామకృష్ణకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Ramakrishna is in the Supreme Court - Sakshi

అతనిపై ఉన్న కోర్టు ధిక్కార పిటిషన్‌ బదిలీకి నిరాకరణ

స్వయంగా విచారణ జరపాలని సీజేను కోరిన ధర్మాసనం

న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా రామకృష్ణ మాటలు

సుమోటోగా ధిక్కార చర్యలకు  హైకోర్టు శ్రీకారం

స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం

సుప్రీంను ఆశ్రయించిన రామకృష్ణ  

సాక్షి, హైదరాబాద్‌: పలు కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన న్యాయాధికారి ఎస్‌.రామకృష్ణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఉమ్మడి హైకోర్టు తనపై సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరో హైకోర్టుకు బదిలీ చేసే విషయంలో రామకృష్ణ తరఫు న్యాయవాది తమను ఒప్పించలేకపోయారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రామకృష్ణపై హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంది.

పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి (సీజే) నియమితులైన నేపథ్యంలో, ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యంపై స్వయంగా విచారణ జరపాలని సీజేను కోరింది. ఆరోపణలు, ప్రత్యారోపణలను పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ నవీన్‌ సిన్హాల ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రామకృష్ణను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో రామకృష్ణ, మీడియా సమావేశం పెట్టి హైకోర్టును, న్యాయమూర్తులను సవాలు చేయడంతో పాటు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడారు. ఆయన మాటలను కొన్ని చానళ్లు సైతం ప్రసారం చేశాయి.

మీడియా సమావేశ నిర్వాహకులు రామకృష్ణ వ్యాఖ్యలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. రామకృష్ణ మాట్లాడిన మాటలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని భావించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘం అప్పటి అధ్యక్షుడు సి.నాగేశ్వరరావు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)కి లేఖ రాశారు. ఏసీజే ఈ లేఖను పరిశీలించి, దానిని సుమోటోగా కోర్టు ధిక్కార పిటిషన్‌గా పరిగణించారు. ఈ ధిక్కార పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రారంభించింది. రామకృష్ణ నిర్వహించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన మీడియా సమావేశ వివరాలను, అందుకు సంబంధించిన సీడీని ఆయన ధర్మాసనం ముందుంచారు.  

న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడమేనన్న ధర్మాసనం...
మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడిన మాటల వివరాలను తెలుసుకున్న ధర్మాసనం, అవి న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. ఎందుకు కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోరాదో స్వయంగా తమ ముందు హాజరై వివరించాలంటూ రామకృష్ణకు నోటీసులు జారీ చేసింది. అంతేకాక తదుపరి ఆయన గానీ, అతని అనుచరులు గానీ కోర్టు విచారణలో ఉన్న అంశాలకు సంబంధించి ఎటువంటి పత్రికా, ఎలక్ట్రానిక్‌ మీడియా సమావేశాలు నిర్వహించకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది.

అలాగే సోషల్‌ మీడియా ద్వారా కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాల గురించి చర్చించడానికి వీల్లేదని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తాను మాట్లాడిన మాటలను హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తుండటంతో తనకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన రామకృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై హైకోర్టులో ఉన్న కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని మరో హైకోర్టుకు బదిలీ చేయాలంటూ 2017లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

పలు విచారణల అనంతరం ఈ పిటిషన్‌ గత వారం జస్టిస్‌ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రామకృష్ణ తరఫు న్యాయవాది మరో వాయిదా కోరగా, ధర్మాసనం అందుకు నిరాకరించింది. అనంతరం వాదనలు విన్న ధర్మాసనం, ఉమ్మడి హైకోర్టు చేపట్టిన కోర్టు ధిక్కార చర్యల విషయంలో జోక్యానికి నిరాకరించింది. మరో హైకోర్టుకు బదిలీ చేసేందుకు నిరాకరిస్తూ రామకృష్ణ అభ్యర్థనను తోసిపుచ్చింది. పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి నియమితులైన నేపథ్యంలో ఆయననే స్వయంగా రామకృష్ణపై ఉన్న కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని విచారించాలని కోరింది.

రామకృష్ణకు చీవాట్లు...
తనపై దాడి చేశారంటూ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డిపై రామకృష్ణ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఉమ్మడి హైకోర్టు గత ఏడాది తేల్చింది. జస్టిస్‌ నాగార్జునరెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేయడమే కాకుండా అవి నిజమైనవేనని నమ్మించేందుకు రామకృష్ణ సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తప్పుడు డాక్యుమెంట్లనీ స్పష్టం చేసింది. రామకృష్ణ అబద్ధాలనే పునాది మీద అవాస్తవాలు.. అభూత కల్పనలు.. తప్పుడు డాక్యుమెంట్లు.. స్థిరత్వం లేని.. పరస్పర విరుద్ధమైన వాదనలను ఇటుకలుగా పేర్చి ఈ కేసును నిర్మించారంటూ అతనిపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top