చిత్రమైన చీర

Raja Ravivarma paintings on Sarees hyderabad - Sakshi

ఆ‘కట్టుకునే’ రాజా రవివర్మ చిత్రాలు

సిటీ డిజైనర్‌ వినూత్న ప్రయత్నం

తొలిసారిగా మ్యూజియమ్స్‌లో ప్రదర్శన

సాధారణంగా డిజైనర్లు సృష్టించిన దుస్తుల కలెక్షన్‌ చూడాలంటే  బొటిక్స్‌కు వెళ్లాలి. లేదా ఫ్యాషన్‌ షో, ఎక్స్‌పోల్లోనో చూడాలి. కానీ ఆ‘కట్టుకునే’ అపురూప చిత్రాల చీరలు చూడాలంటే మాత్రం మ్యూజియమ్స్‌కి వెళ్లాల్సిందే. అంత మాత్రాన అవి ఎప్పటివో చరిత్ర తాలూకు అవశేషాలు కావు.. నేటి మన సిటీ డిజైనర్‌ఆవిష్కరించిన అద్భుతాలు.

సాక్షి, సిటీబ్యూరో: చిత్రలేఖనంలో ప్రవేశమున్నవారికి మాత్రమే కాదు.. కళలపై కాసింత అవగాహన ఉన్నవారికి కూడా రాజా రవివర్మ అంటే పరిచయం అక్కర్లేని పేరు. రాజవంశీకుడిగానే కాదు తన చిత్రలేఖనా ప్రతిభతోనూ చరిత్ర కెక్కిన రవివర్మ చిత్రాలు మనదేశపు కళా సంపద. అలాంటి చిత్ర సంపదను ఆధునిక ఫ్యాషన్లకు ఆలంబనగా మార్చారు నగరానికి చెందిన డిజైనర్‌ గౌరంగ్‌ షా. ప్రస్తుతం  ముంబైలోని నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌ (ఎన్‌జీఎంఏ)లో ఆయన తన చిత్రాల చీరలను ప్రదర్శిస్తున్నారు. 

అసాధ్యం నుంచి అద్భుతం
‘రవివర్మవి సహజమైన రంగులతో తీర్చిదిద్దిన అద్భుత చిత్రాలు. అవి రంగుల, భావాలు, వివరాల గల గొప్ప సమ్మేళనం. అంతగా వెలుగులోకి రాని రవివర్మ గీచిన అద్భుత పెయింటింగ్స్‌లో మహిళలు, దేవతలు, కథలు.. ఇలా మూడు విభాగాలుగా విభజించి 30 పెయింటింగ్స్‌ను ఎంచుకున్నాం. ఆరు నెలల కాలాన్ని పూర్తిగా పరిశోధనకే కేటాయించాం. తొలుత వీటి గురించి మాస్టర్‌ వీవర్స్‌తో చర్చించినప్పుడు వారు ఇది సాధ్యమా అన్నట్టు అనుమానం వ్యక్తపరిచారు. దీనికి తగ్గట్టే ఖాదీలో నేచురల్‌ డైలను ఉపయోగించి ఈ చీరలు నేయాల్సి ఉండడం కూడా మరో సవాలు. తొలి రెండు చీరల ప్రయోగం విఫలమైన తర్వాత మూడో చీరకు సక్సెస్‌ అయ్యాం. ప్రతి పెయింటింగ్‌కు ఒక కలర్‌ చార్ట్‌ క్రియేట్‌ చేయాల్సి వచ్చింది. ఆ చిత్రాల మీద ఉన్న అచ్చమైన రంగులను తలపించేందుకు మేం 600 షేడ్స్‌ సృష్టించాం’ అంటూ గౌరంగ్‌ తన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శన

ఎప్పటి నుంచో తన చీరలను మ్యూజియమ్స్‌లో చూడాలని అనుకుంటున్నానని, రెండేళ్ల పాటు సాగిన ఈ ప్రాజెక్ట్‌ తన కల సాకారం చేసిందని గౌరంగ్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చీరలపై చిత్రాలను సృష్టించేందుకు ఒక్కో చీరకు 3 నెలలు పడితే మరో చీరకు 10 నెలలు కూడా పట్టిందని వివరించారు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ ‘చిత్ర’మైన చీర ప్రదర్శన నవంబర్‌ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. తర్వాత ఢిల్లీకి చేరనుంది. అలా అలా ఈ చీరలను నగరంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించాక వీటిని ఆన్‌లైన్‌ ద్వారా వేలం వేయాలని గౌరంగ్‌ భావిస్తున్నారు.  

సిటీ ఆర్టిస్ట్‌తో మొదలు..
ప్రాచుర్యం పొందిన చిత్రాలను చీరలపై కొలువుదీర్చడం అనే ప్రక్రియలో గౌరంగ్‌కు తొలి స్ఫూర్తిని అందించింది కూడా నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడే కావడం విశేషం. ‘2013లో సిటీకి చెందిన లక్ష్మణ్‌ ఏలె పెయింటింగ్స్‌ను చూసినప్పుడు చాలాబాగా నచ్చాయి. దాంతో ఆయన వేసిన ఆరు చిత్రాలను నా చీరల కలెక్షన్‌లో పునఃసృష్టించాను. ఆ చీరల ప్రదర్శనకు వచ్చినవారిలో ఒకరైన లావినా ఒక చీర కొనుగోలు చేయడంతో పాటు అప్పటి నుంచి ఆమె నాతో కలిసి ఓ గొప్ప ప్రాజెక్ట్‌ చేయాలని ఆసక్తి చూపేవారు. బెంగళూరులోని రాజా రవివర్మ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులను నాకు పరిచయం చేయడంతో మూడేళ్ల తర్వాత ఆమె ఆలోచన కార్యరూపం దాల్చింది’ అంటూ గౌరంగ్‌ చెప్పారు. అలా సిటికి చెందిన ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్‌ ఏలె చిత్రాలను తన చీరల మీద ప్రతిష్టించడం ద్వారా సరికొత్త చిత్ర ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన గౌరంగ్‌ షా.. రాజా రవివర్మ చిత్రాలను ఒక్కో చీర పల్లూపై కొలువుదీర్చారు. గాంధీ జయంతి, రవివర్మ వర్ధంతి రెండూ అక్టోబరు 2నే కావడంతో ‘ఖాదీ ఏ కాన్వాస్‌’ పేరుతో ప్రదర్శనకి తెర తీశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top