జనగామ ‘బాహుబలి’

Prabhas Fan climbs cell Tower In Warangal - Sakshi

హీరో ప్రభాస్‌ రావాలంటూ సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు

టవర్‌ ధ్వంసం రూ.లక్షల్లో నష్టం

సాక్షి, జనగామ: ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి సినీ హీరో ప్రభాస్‌ను చూడాలి.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ.. ఐదు గంటల పాటు హల్‌చల్‌ చేశాడు. ఉదయం 8 గంటలకు సెల్‌టవర్‌ ఎక్కిన ఇరవై ఏళ్ల యువకుడు... మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘బాహుబలి’ స్టైల్‌లో సర్కస్‌ ఫీట్లు చేస్తూ... ఆల్‌ ఆఫ్‌యూ గెట్‌ అవుట్‌ అంటూ హెచ్చరికలు జారీ చేసిన ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రం వరంగల్‌ హైవే ఉడుముల ఆస్పత్రి ఎదురుగా పెట్రోల్‌ బంకు పక్కన ఓ సెల్‌ టవర్‌పై చోటు చేసుకుంది. వివరాళ్లోకెళితే.. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం గుండెంగుల గ్రామం శివారు పాపాయతండాకు చెందిన యువకుడు గుగులోతు వెంకన్న(20) జిల్లా కేంద్రంలోని సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు.

హీరో ప్రభాస్‌ను చూడాలని టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ సంతోష్‌కుమార్, ఎస్సైలు శ్రీనివాస్, రవికుమార్, జిల్లా వైద్యాధికారి మహేందర్, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పుజారి రఘు, ఆర్‌ఎంఓ డాక్టర్‌ పడిగిపాటి సుగుణాకర్‌రాజు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూటీం హుటాహుటినా అక్కడకు చేరుకున్నారు. హిందీ..ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ... ఐ లవ్‌యూ ప్రభాస్‌.. ఇలా మరికొందరి పేర్లు రాసి.. కిందకు విసిరేశాడు.

అంతేకాకుండా సెల్‌టవర్‌ కేబుల్, సిగ్నల్‌ పాయింట్‌కు సంబంధించిన పరికరాలను పూర్తిగా ధ్వంసం చేసి.. సైకోఇజాన్ని ప్రదర్శిస్తుండగా పోలీసులు టవర్‌ చుట్టూ వలలను ఏర్పాటు చేశారు. పోలీసులు మాట్లాడుతూ హీరో ప్రభాస్‌ వచ్చాడు.. కిందకు దిగు తమ్ముడు అంటూ గంటల పాటు బతిమిలాడారు. మధ్యాహ్నం 12.50 నిమిషాలకు ఒక్కోమెట్టు దిగుతూ మధ్యకు చేరుకున్న యువకుడు... బాటిల్‌లోని నీటితో స్నానం చేసి కిందకు వచ్చాడు. వెంటనే పోలీసులు వెంకన్నను అదుపులోకి తీసుకుని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top