తారు బేఖారు..!

Potholes On Roads In Karimnagar - Sakshi

కరీంనగర్‌–వరంగల్‌ స్టేట్‌హైవే నరకప్రాయంగా మారింది. అడుగుతీసి అడుగు వేస్తే గుంతల మయం.. వాహనాల్లో ప్రయాణించే వారికి ఈ రహదారి ఇబ్బందికరంగా మారింది. ఒక్కో కిలోమీటరుకు సుమారుగా రూ.66.66 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన రహదారికి బీటలు బారుతున్నాయి. రెట్టింపు అంచనాలతో బందోబస్తుగా ఉండాలని నిధులు కేటాయిస్తే మెరుగుపడాల్సిన సౌకర్యాలు దిగజారిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు మరింత దెబ్బతింది.

అధికారులు, కాంట్రాక్టర్లు చేతులు కలపడంతో ఏడాదిన్నరకే కరీంనగర్‌–వరంగల్‌ రోడ్డు అధ్వానంగా తయారైంది. కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వరకు పూర్తిగా చెడిపోయిన చోట్లల్లా నిర్మాణం, మరమ్మతుల పేరిట 48 కిలోమీటర్ల మేరకు పనులు చేశారు. ఇందుకోసం రూ.32 కోట్లు ఖర్చు చేశారు. అంతకుముందు రోడ్డు పనుల్లో నాణ్యత లేదని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోగా, మరమ్మతుల పేరిట రూ.32 కోట్లతో చేసిన పనులు కూడా దెబ్బతింటుండటంతో ఈ రహదారిపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రీంనగర్‌ మీదుగా వరంగల్‌ వరకు ఉన్న 70 కిలోమీటర్ల రహదారుల భవనాల శాఖ పరిధిలోని రోడ్డును నాలుగేళ్ల కిందటే జాతీయ రహదారులు (ఎన్‌హెచ్‌) పరిధిలోకి చేరుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశా రు. ఎన్‌హెచ్‌–563 నంబర్‌ సైతం కేటాయించారు. ఎన్‌హెచ్‌ పరిధిలోకి వెళ్లిన తర్వాత రహదారులు భవనాల శాఖ దీని నిర్వహణ నుంచి తప్పుకుంది. ఎన్‌హెచ్‌కు అప్పుడు స్థానికంగా కార్యాలయం, అధికారులు లేకపోవడం.. రహదారుల పరిస్థితిపై సరైన సమాచారం లేక రోడ్డు పూర్తిగా దెబ్బతినేంత వరకు మరమ్మతు చేయలేదు. ఈ రహదారి తమ పరిధిలో ఉన్నప్పుడు ఎన్‌హెచ్‌ విభాగం నుంచి నిధులు కేటాయించారు. మరమ్మతులు పూర్తయ్యాక రద్దీ దృష్ట్యా దీన్ని ఎన్‌హెచ్‌ఏఐ తన పరిధిలోకి తీసుకుంది.

ప్రస్తుతం కరీంనగర్‌ ఎన్‌హెచ్‌కు కార్యాలయం పర్యవేక్షణ ఇంజినీర్‌ ఉన్నారు. కానీ.. ఈ రహదారి ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో ఉంది. దీంతో రహదారిపై ఎన్‌హెచ్‌ విభాగం పెద్దగా దృష్టిపెట్టడం లేదు. ఫలితంగా రోడ్లలో నాణ్యత లోపించి దెబ్బతింటున్నాయి. ఎన్‌హెచ్, ఎన్‌హెచ్‌ఏఐ శాఖల మధ్య సమన్వయం కొరవడడం ప్రజలకు శాపంగా మారగా, ఏ శాఖ పరిధిలోకి ఈ రోడ్డు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో రూ.32 కోట్లు వెచ్చించి చేసిన పనులో జవాబుదారీతనం లేకపోగా, అక్రమాలపై భుజాలు తడుముకోవడం, అధికారులు దాటవేసే పద్ధతిని అవలంబిస్తున్నారు. కాగా.. ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం ఏమీ పట్టించుకోకపోవడం చర్చనీయాంశం అవుతోంది.

కిలోమీటర్‌కు రూ.66.66 లక్షలు..  
అప్పట్లో రోడ్డు శిథిలమవడంతో ఎట్టకేలకు జాతీయ రహదారుల సంస్థ రంగంలోకి దిగింది. ఏడాదిన్నర క్రితం కరీంనగర్‌–వరంగల్‌ మార్గం లో పూర్తిగా దెబ్బతిన్న 48 కిలోమీటర్ల మేర మరమ్మతుకు రూ.32 కోట్లు కేటాయించింది. అంటే సగటున కిలోమీటర్‌ మరమ్మతుకు రూ.66.66 లక్షలు. గతేడాదిలో దశల వారీగా ఈ మరమ్మతులు చేశారు. కానీ.. మొత్తంగా ఏడాదిన్నర పూర్త య్యే లోపే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎక్కడపడితే అక్కడ గుంతలు పడ్డాయి. దీంతో హడావిడిగా అక్కడక్కడ అతుకులు వేశారు. మరమ్మతుల నిర్వహణ రెండేళ్ల వరకు చేపట్టాల్సిన కాంట్రాక్టరు చేతులెత్తడంతో అగమ్యగోచరంగా మా రింది. రహదారుల మరమ్మతుకు సంబంధించి కనీసం రెండు మూడేళ్లపాటు నిర్వహణ చేపట్టాల ని ఒప్పందం కుదుర్చుకుంటారు.

కానీ.. ఇప్పుడు ఎవరూ సరైన దృష్టి పెట్టకపోవడంతో గుత్తేదారు సంస్థ అప్పనంగా గాలికి వదిలేసింది. పనులు చేస్తున్న సమయంలో సరైన పర్యవేక్షణ లేక నామమాత్రంగా చేపట్టడంతో గుత్తేదారుకు భారీగా ల బ్ధి చేకూరింది. ప్రజాధనం వ్యయమైనా వాహనదారులు, ప్రయాణికులకు ఫలితం దక్కలేదు. ని రంతరం ఎక్కడో ఒక చోట రోడ్డుకు మరమ్మతు చేయాల్సిన పరిస్థితి. పనులు చేసే సమయంలో నాణ్యమైన తారు వాడకపోవడం, సరిగా రోలింగ్‌ చేయకపోవడం, ఇంజినీర్ల పర్యవేక్షణ లోపంతో నాసిరకం పనులు చేపట్టడంతో రూ.కోట్లు వెచ్చిం చినా.. ఫలితం లేకుండా పోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

హైవే పైనుంచి వెళ్లాలంటే భయంగా ఉంది 
కరీంనగర్‌–వరంగల్‌ హైవేపై గుంతలు పెద్దగా ఉన్నాయి. ఈ గుంతల రహదారిపై ద్విచక్ర వాహనంతో వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆఫీస్‌ పనులు ముగించుకొని రాత్రిపూట ఈ దారి గుండా వస్తుంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నాం. ఉన్నతాదికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలి. – నల్లా నవీన్, ప్రయాణికుడు, హుజూరాబాద్‌

గుంతలు తెలియక ప్రమాదాలు 
కరీంనగర్‌కు పనులు నిమిత్తం వెళ్లాలంటే రోడ్డు పరిస్థితిని చూసి ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొత్తపల్లి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ బ్రిడ్జిపై పెద్ద గుంత ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. హుజూరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వరకు రహదారి అస్తవ్యస్తంగా మారింది. అధికారులు స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలి. – మాట్ల శ్రీకాంత్, ప్రయాణికుడు, హుజూరాబాద్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top