వీడని ఉత్కంఠ!

Political Parties Confusion On Contestents Of Nagarkurnool Mp Seat - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: 
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎవరనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న నంది ఎల్లయ్యను ఖరారు చేస్తారా లేదా ఇతరులకు కేటాయిస్తారా అనే విషయంలో తర్జనభర్జన కొనసాగుతోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై కాంగ్రెస్‌ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాజీ మంత్రి పి.రాములుకు కేటాయిస్తారనే చర్చ కొనసాగుతోంది.

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో నామినేషన్ల స్వీకరణకు కేవలం మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆ లోగానే అభ్యర్థులను  ప్రకటించాల్సిన అవసరం ఉంది. దీంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులను ఎప్పుడు ఖరారు చేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్‌ అభ్యర్థులను శనివారం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. శుక్రవారం జరిగిన సీఈసీ సమావేశంలో అభ్యర్థులు ఎవరనే విషయంపై కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.  

అధికార పార్టీ అభ్యర్థిగా రాములు? 
శాసనసభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాలకు గానూ ఆరు నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుని ఉత్సాహంగా ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానాన్ని కీలకంగా భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17ఎంపీ స్థానాలలో 16 స్థానా లు గెలవాలని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది.

ఈనెల 9వ తేదీన వనపర్తిలో జరిగిన సన్నాహక సమావేశంలో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలకు దిశానిర్దే శం చేశారు. ఎలాగైనా నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. గత మూడు పర్యాయాలుగా నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచింది లేదు.

కానీ ఈసారి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కొల్లాపూర్‌ మినహా మిగిలిన ఆరు చోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే విజయం సాధించడం, అన్ని చోట్లా టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీ ఉండటం వంటి కారణాల నేపథ్యంలో ఈసారి నాగర్‌కర్నూల్‌ ఎంపీ స్థానం తమదేనన్న ధీమా ఆ పార్టీ నాయకత్వంలో వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నుంచి పలువురు టికెట్‌ ఆశిస్తున్నప్పటికీ మాజీ మంత్రి పి. రాములు పేరు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. టీఆర్‌ఎస్‌ నేత మందా జగన్నాథం, గాయకుడు సాయిచంద్, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత శ్రీశైలం కూడా తమకు ఎంపీ టికెట్‌ కేటాయించా లని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిసింది.  

కాంగ్రెస్‌ అభ్యర్థులపై కసరత్తు 
నాగర్‌కర్నూల్‌ స్థానంలో అత్యధిక సార్లు గెలిచిన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఎన్నికల్లోనూ సరైన అభ్యర్థిని బరిలో ఉం చాలని కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం వద్ద జాబితా సిద్ధంగా ఉంద ని, అన్ని సమీకరణాలను బేరీజు వేసుకుని శుక్రవారం జరిగిన సీఈసీ సమావేశంలో అభ్యర్థి ఎవరనేది ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
గత ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన, ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ నంది ఎల్లయ్యకు అధిష్టానం మొగ్గుచూపుతోందని, ఒకవేళ ఆయన బరిలో లేకుంటే మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, సతీష్‌ మాదిగ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నేడు, రేపు స్పష్టత  
కాంగ్రెస్‌ అభ్యర్థులను అధిష్టానం శనివారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి విడతలోనే నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటిస్తుందని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే అధినేత కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలతో ఫోన్‌ ద్వారా సంప్రదించి లోక్‌సభ అభ్యర్థులు ఎవరు ఉండాలనే అంశంలో అభిప్రాయాలు సేకరించారు. ఈనేపథ్యంలోనే నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థిగా పి.రాములు పేరు దాదాపు ఖరారైందని వినిపిస్తోంది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top