పట్టు ఎవరిదో?  | Political Leaders Election Campaign In Medak | Sakshi
Sakshi News home page

పట్టు ఎవరిదో? 

Oct 27 2018 12:28 PM | Updated on Nov 6 2018 9:25 AM

Political Leaders Election Campaign In Medak - Sakshi

మెదక్‌ శివాలయంలో పూజలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి నర్సాపూర్‌లో శుక్రవారం ప్రచారం చేస్తున్న డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి

సాక్షి, మెదక్‌: పట్టణ ఓటర్లపై పార్టీలు కన్నేశాయి. వారిని ప్రసన్నం చేసుకొని ఆ ప్రభావం పల్లెలపై పడేలాగా పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి. పట్టణాలపై పట్టు చిక్కితే పల్లె ఓటర్లను సైతం తమవైపు తిప్పుకోవచ్చని పార్టీలు భావిస్తున్నాయి. దీనికి అనుగుణంగానే జిల్లాలోని రాజకీయ పార్టీలు మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు కాంగ్రెస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌లు మున్సిపాలిటీల్లో పట్టుపెంచుకుని తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాయి.

ఇందులో భాగంగా మెదక్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల్లోని ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మూడు మున్సిపాలిటీల్లో 48, 646 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్‌ మున్సిపాలిటీలో 26,519 మంది ఓటర్లు ఉండగా రామాయంపేట మున్సిపాలిటీలో 10,781 మంది ఓటర్లు ఉన్నారు. నర్సాపూర్‌ నియోకజవర్గం పరిధిలోని నర్సాపూర్‌ మున్సిపాలిటీలో 11346 మంది ఓటర్లు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు మున్సిపాలిటీల్లో ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించనప్పటికీ మున్సిపాలిటీల్లో పట్టుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
 
మెదక్‌పై పట్టుకోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఎత్తుగడలు
మెదక్‌ మున్సిపాలిటీలో పట్టుకోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌తోపాటు కౌన్సిలర్లు మెజార్టీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉండటం ఆ పార్టీకి అనుకూలించే అంశం. దీనికి తోడు ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌ మున్సిపాలిటీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. స్వయంగా తానే పట్టణంలోని ముఖ్యులను, కులసంఘాల నాయకులను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ఆమె శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మెదక్‌ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ పద్మాదేవేందర్‌రెడ్డి ఓటర్ల మద్దతు కోరుతున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ సహా కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఓటర్ల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నయ్యారు.

అయితే పార్టీలోని కొంత మంది కౌన్సిలర్లు, నాయకుల్లో అసంతృప్తి ఉంది. దీనికితోడు మెదక్‌ పట్టణంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు ముందుకుసాగడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పట్టణ నేతల్లో కొంత అయోమయం ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మాజీ చైర్మన్, కాంగ్రెస్‌ బీసీ నేత భట్టి జగపతికి మెదక్‌లో మంచి పట్టు ఉంది. ఇది కాంగ్రెస్‌కు అనుకూలించే అంశం. టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌ వ్యూహ రచన చేస్తోంది.

అయితే పట్టణ కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ సైతం మెదక్‌ మున్సిపాలిటీలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన రామాయంపేట మున్సిపాలిటీలో 10,781 మెజార్టీ ఓట్ల సాధన కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కసరత్తు చేస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి సొంత ప్రాంతం కావడంతో టీఆర్‌ఎస్‌కు అనుకూలిస్తుందని ఆ పార్టీ నేతల అంచనా. అయితే డివిజన్‌ కేంద్రం కోసం రామాయంపేట పట్టణ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.

నర్సాపూర్‌పై ఇరుపార్టీల కన్ను 
నియోజకవర్గ కేంద్రంతోపాటు మున్సిపాలిటీ అయిన నర్సాపూర్‌పై పట్టుకోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పోటీ పడుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన నర్సాపూర్‌ మున్సిపాలిటీలో 11346 మంది ఓటర్లు ఉన్నారు.  రెండు పార్టీలు మెజార్టీ ఓట్లు సాధించేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి నర్సాపూర్‌ మున్సిపాలిటీలో ర్యాలీ నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. త్వరలో ఇంటింటి ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి సునీతారెడ్డి శుక్రవారం ప్రచారం ప్రారంభించారు. ఇరువురు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ నేత మురళీయాదవ్‌కు మంచి పట్టు ఉండటం టీఆర్‌ఎస్‌కు అనుకూలించే అంశం.

అభివృద్ధి పనులు, నర్సాపూర్‌ను మున్సిపాలిటీగా మార్చడం, బస్టాండు నిర్మాణం తదితర అంశాలు తమకు కలిసివస్తాయని టీఆర్‌ఎస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పట్టణ నాయకులు రమణారావు, అశోక్‌గౌడ్‌ తదితరులు ఎమ్మెల్యేకు మద్దతుగా పట్టణ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి సునీతారెడ్డి నర్సాపూర్‌లో మెజార్టీ ఓట్లు సాధించేందుకు పావులు కదుపుతున్నారు.

టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలకు గాలం వేయడంతోపాటు పట్టణ సమస్యలు, అభివృద్ధి పనుల్లో లోపాలు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పూర్తి కాకపోవడం తదితర అంశాలతో ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కూడగట్టాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులు సత్యనారాయణ, నర్సింలు, నయీం తదితరులు నర్సాపూర్‌ మున్సిపాలిటీలో సునీతారెడ్డికి ఓటర్ల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. ముందు ముందు రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement