ప్లాస్టిక్‌.. పారిపో

Plastic Ban Soon In GHMC Greater Hyderabad - Sakshi

సిటీలో దశలవారీగా నిషేధం అమలు

తొలుత అవగాహన, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ఆ తర్వాతే కఠిన చర్యలు

ముంబై అనుభవాలతో జీహెచ్‌ంఎసీ చర్యలు

ప్లాస్టిక్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ గ్రేటర్‌ కమిషనర్‌ ట్వీట్‌

సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణానికి పెను సవాలుగా మారిన ‘ప్లాస్టిక్‌’ వినియోగాన్ని గ్రేటర్‌లో దశలవారీగా నిషేధించనున్నారు. మైక్రాన్లతో నిమిత్తం లేకుండా ఇప్పటికే జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో ప్లాస్టిక్‌ నిషేధానికి తీర్మానం చేశారు. ఇటీవల పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2022 నాటికి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో ప్లాస్టిక్‌ నిషేధంపై చిరువ్యాపారుల నుంచి, ప్లాస్టిక్‌ ఉత్పత్తిదారుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలనుపరిగణనలోకి తీసుకున్న గ్రేటర్‌ అధికారులు ఇక్కడ దశలవారీగా నిషేధ యజ్ఞాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌ నిషేధంపై దృష్టి సారించారు. 

అవి ఉత్పత్తి చేసే వారిపైనా, వినియోగించే వ్యాపారులపైనా చర్యలు తీసుకుంటున్నారు. దశలవారీగా మిగతా ప్లాస్టిక్స్‌ను నిషేధించాలని, వివిధ వర్గాల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ముమ్మర ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫంక్షన్‌హాళ్లు, కల్యాణ మండపాలు వంటి ప్రాంతాల్లో వాడే ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులు, కప్పుల స్థానే స్టీల్, పింగాణీ, గాజువి వాడేలా అవగాహన కల్పించనున్నారు.  విద్యార్థులకు అవగాహన కల్పిస్తే ఇంటిల్లిపాదీ ఆచరించేలా చేస్తారనే తలంపుతో పది లక్షల మంది విద్యార్థులకు ఈ సంవత్సరం అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. బస్తీల్లోని స్వయం సహాయక మహిళా బృందాల ద్వారా ప్రతి ఇంటికీ ప్రచారం చేయానున్నారు. ఓవైపు ప్రచారం నిర్వహిస్తూ.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వస్తువుల కొనుగోలుకు టిఫిన్‌ బాక్సులు, జూట్, క్లాత్‌ బ్యాగులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రాథమికంగా ఈ కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టినప్పటికీ, మరింత ముమ్మరం చేయనున్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు లేని పక్షంలో నిషేధం సాధ్యం కాదని ముంబై అనుభవం నిరూపించడంతో ఆదిశగానూ పకడ్బందీ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. 

ముంబైలో ఏం జరుగుతోందంటే..  
ముంబై మహానగరంలో మార్చి నెలలో ప్లాస్టిక్‌ నిషేధం ప్రకటన జారీ చేసి ఈనెల 23 నుంచి అమల్లోకి తెచ్చారు. దుకాణాలు, సంస్థలపై భారీగా దాడులు చేస్తూ పెనాల్టీలు విధించారు. నిషేధంపై ప్రజలకు తగిన అవగాహన కల్పించలేదు. ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తేలేదు. బ్రాండెడ్‌ కంపెనీలు చిప్స్‌కు వినియోగించే ప్లాస్టిక్‌ కవర్లను మాత్రం అనుమతిస్తూ.. సామాన్య ప్రజలకు అవసరమైన పప్పులు, బియ్యం, చక్కెర వంటివాటికి వినియోగించే ప్లాస్టిక్స్‌ క్యారీ బ్యాగుల్ని నిషేధించడంతో వివిధ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈనేపథ్యంలో రిటైల్‌ సరుకుల ప్యాకింగ్స్‌కు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. తిరిగి వాటిని రీసైకిల్, రీయూజ్‌ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టే చర్యలకు సిద్ధమైంది. ప్లాస్టిక్‌ నిషేధం వల్ల తలెత్తే పరిస్థితుల్ని అంచనా వేయకపోవడం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలమవడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో తొలుత ప్రజల ఆలోచనల్లో మార్పు తెచ్చి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి.. దశలవారీగా ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. 

ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఇలా..  

  • బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఈనెల 23 నుంచి అమల్లోకి తెచ్చిన ప్లాస్టిక్‌ నిషేధం ప్రకంపలను సృష్టిస్తోంది.  
  • పలు వర్తక సంఘాలు నిషేధాన్ని నిరసిస్తూ ఆందోళనలకు దిగాయి. ప్లాస్టిక్‌ నిషేధాన్ని ఎత్తివేయని పక్షంలో ఆందోళనలు తీవ్రం చేయనున్నట్లు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌)చీఫ్‌ రాజ్‌థాకరే హెచ్చరించారు. రాబోయే ఎన్నికలకు నిధులు సమకూర్చుకునేందుకే ఈ నిషేధాన్ని తెచ్చి జరిమానాల ద్వారా వసూలు చేస్తున్నారని ఆరోపించారు.  
  • ఐదు రోజుల్లో బీఎంసీ తనిఖీ బృందాలు 19,240 దుకాణాల్లో తనిఖీలు చేసి 35 సంస్థలకు ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్స్‌(ఐఆర్‌) జారీ చేశాయి.  
  • 1226.8 కిలోల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నాయి. రూ.13.30 లక్షల పెనాల్టీలు వసూలు చేశాయి.  
  • జరిమానా చెల్లించేందుకు నిరాకరించిన 16 సంస్థలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.  
  • ప్లాస్టిక్‌ వాడేందుకు రిటైల్‌ దుకాణాలను అనుమతించని పక్షంలో సమ్మెకు దిగనున్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ రిటైల్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హెచ్చరించారు.  
  • మైక్రాన్లతో సంబంధం లేకుండా టీకప్పులు, గ్లాసులు, ఆహార పదార్థాలు ప్యాక్‌చేసే డబ్బాలు, స్పూన్లు అన్నింటిపైనా నిషేధం ప్రకటించారు. ప్రస్తుతం వేటిపై నిషేధం ఉందో.. వేటికిలేదో స్పష్టత లేకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.  
  • ప్లాస్టిక్‌ వాడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమానా విధించారు.  
  • మూడోసారి రూ. 25వేల జరిమానాతో పాటు మూడునెలల జైలుశిక్షగా ప్రకటించారు.  
  • గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ఇలా..
  • నిత్యం వెలువడుతున్న వ్యర్థాలు 4800 మెట్రిక్‌ టన్నులు వీటిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు 450 మెట్రిక్‌ టన్నులు
  • ఇందులో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాలు 270 మెట్రిక్‌ టన్నులు
  • ఏటా వాడుతున్న ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు 73,00,00,000
  • మొత్తం ప్లాస్టిక్‌లో రీసైక్లింగ్‌ అవుతున్నది 14 శాతం  
  • ప్రస్తుతం 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ వాడకుండా జరిమానాలు విధిస్తున్నారు.  

దశలవారీగా ముందుకెళ్తాం..
ప్లాస్టిక్స్‌ ఎంత ప్రమాదకరమో, పర్యావరణానికి ఎంత హానికరమో  ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే అందరూ నిషేధాన్ని పాటిస్తారు. ప్రజలకు అర్థమయ్యేందుకు ఒక్కో నెల ఒక్కో అంశంపై నిషేధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం. ఉదాహరణకు ఒక నెలంతా  ప్టాస్టిక్‌ గ్లాసులు వాడరాదని ప్రచారం చేసి ప్రత్యామ్నాయాలను చూపిస్తాం. అందుకు ప్లాస్టిక్‌ గ్లాసెస్‌ నిషేధ మాసంగా  పరిగణిస్తాం. మరో నెల కప్పుల మాసం.. ఇంకో మాసం కట్లెరీ మాసంగా ప్రచారం చేస్తాం. తద్వారా ప్రజల్లో వాటిని వాడరాదని బలంగా నాటుకుంటుంది. ఉత్పత్తిదారులకూ నిషేధంపై అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే మాంసానికి టిఫిన్‌ బాక్సులు వాడేలా చేసిన ప్రచారం మంచి ఫలితాలిచ్చింది. 2022 నాటికి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధిస్తాం.    – డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌  

ప్రత్యామ్నాయాలు లేకుండా అసాధ్యం  
నిత్యావసరంగా మారిన ప్లాస్టిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా నిషేధించడం సాధ్యం కాదు. అన్ని ప్లాస్టిక్స్‌ వల్లా హాని ఉండదు. రీసైకిల్‌ చేయగలిగే వాటిని వినియోగించవచ్చు. తగిన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తెచ్చి నిషేధించవచ్చు. ఉత్పత్తి చేసిన కంపెనీ తిరిగి వాటిని సేకరించి, రీసైక్లింగ్‌కు పంపించే ఏర్పాట్లు చేయాలి. ఉన్నపళంగా ప్లాస్టిక్‌ను నిషేధిస్తే వాటిపై ఆధారపడ్డ చిరువ్యాపారులు, ర్యాగ్‌పిక్కర్స్‌ జీవనోపాధి దెబ్బతింటుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని దశలవారీగా నిషేధించాలి.     – అనిల్‌కుమార్, ఆలిండియా ప్లాస్టిక్‌ఉత్పత్తిదారుల సంఘం (సౌత్‌) ఉపాధ్యక్షుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top