జలముంటేనే జంగల్‌కు కళ

PCCF R Sobha Directed Forest Authorities To Take Care Of Animals In Forest - Sakshi

వన్యప్రాణులకు అందుబాటులో నీటి వనరులు

అధికారులకు పీసీసీఎఫ్‌ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: అడవుల్లోని జంతువుల కోసం ఏర్పాటు చేసిన సోలార్‌ పంపుసెట్లు, సాసర్‌ పిట్ల వద్ద నిత్యం నీటి నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ ఆదేశించారు. వివిధ జిల్లాల్లో అటవీ ప్రాంతాలను గ్రిడ్‌లుగా విభజించి, సహజ నీటి వనరులు లేని చోట కృత్రిమ వసతి ఏర్పాటుకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నచోట వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నట్టు అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లు, సీసీటీవీ కెమెరాలకు చిక్కినట్టు తెలిపారు. వేసవిలో వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేసే అవకాశాలున్నందున, ఆయా ప్రాంతాల్లో ఫుట్‌ పెట్రోలింగ్‌ చేయాలని, నీటి వసతుల వద్ద ప్రతిరోజూ ఈ తరహా చెకింగ్‌ ఉండాలని ఆదేశించారు.

వేసవి నేపథ్యంలో చేపట్టాల్సిన సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌పై శుక్రవారం అరణ్య భవన్‌ నుంచి జిల్లా అధికారులతో పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎండాకాలంలో టైగర్‌ రిజర్వ్‌లతో పాటు అన్ని అటవీ ప్రాంతాల్లో జంతువుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, నీటి వసతి ఏర్పాటు అంశాలను సమీక్షించారు. క్షీణించిన అటవీ ప్రాంతాలు, బోడి గుట్టలపై ఉపాధి హామీ పనుల అనుసంధానంతో వేసవిలో కందకాల  తవ్వకం చేపట్టాలని, వానాకాలంలో నీటి నిల్వలకు అవి తోడ్పడతాయన్నారు. విధులు, అభివృద్ధి్ద పనుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని పీసీసీఎఫ్‌ హెచ్చరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది, బీట్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన అటవీ బీట్‌లకు రెగ్యులర్‌గా వెళ్తున్నారా లేదా అన్న దాన్ని నోట్‌కామ్‌ యాప్‌ ఫొటోల ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో అదనపు పీసీసీఎఫ్‌లు లోకేష్‌ జైస్వాల్, డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎంసీ పర్గెయిన్, సిధానంత్‌ కుక్రేటీ, ఓఎస్డీ ఎ.శంకరన్, చంద్రశేఖర్‌రెడ్డి, సునీతా భగవత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top