మంచిర్యాలలో పురాతన గోడ..

Old wall at mancherial

తెలంగాణలో మరో ప్రాచీన గుహల జాడ బయటపడింది. మంచిర్యాల సమీపంలోని బుగ్గగట్టు అటవీ ప్రాంతంలోని తాటిమట్టయ్య అనే గుట్టపైన ఇది వెలుగుచూసింది. వివిధ కాలాల్లో చిత్రించినట్టుగా భావిస్తున్న పలు చిత్రాలు గుహ గోడలపై కనిపిస్తున్నాయి. సాధారణంగా ఆదిమానవులు తమ చిత్రాలకు ఎరుపు రంగు వాడతారు. ఇక్కడ ఎరుపుతోపాటు తెలుపు, నలుపు, ముదురు ఆకుపచ్చ రంగు చిత్రాలుండటం విశేషం. దుప్పి, ఎద్దు, అడవి పందులు, ఉడుములు, తాబేలు, గుడ్లగూబ, గబ్బిలాలు, తేనెతుట్టె లాంటి చిత్రాలు గోడలపై కనిపిస్తున్నాయి.

దాదాపు మూడడుగుల ఎత్తుతో మరో ఆకృతి గీసి ఉంది. రెండు కాళ్లు, రెండు చేతులు, తల భాగంలో కిరణాలతో ఉన్న మరో ఆకృతి ఉంది. దీన్ని స్థానికులు తాటిమట్టయ్య దేవుడిగా పిలుచుకుంటున్నారు. అమెరికాలోని ఉతా వ్యాలీ, టెక్సాస్‌ రియోగాండ్‌ లోయ, ఫ్రాన్స్‌లోని మరో ప్రాంతంలో ఇలాంటి భారీ ఆకృతులు కనిపిస్తాయి. దాదాపు పదేళ్ల కాలంలో వీటిని గీసినట్టు భావిస్తున్నామని ఈ చిత్రాల సమూహాన్ని గుర్తించిన ఔత్సాహిక పరిశోధకులు ద్యావనపల్లి సత్యనారాయణ వెల్లడించారు. ఈ చిత్రాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.   
 –సాక్షి, హైదరాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top