దస్నాపూర్‌లో నీల్గాయి హతం

Nilgai killed in dasnapur forest area - Sakshi

ఆదిలాబాద్, వేమనపల్లి (బెల్లంపల్లి) : గాంధీ జయంతి, వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ప్రారంభం రోజునే దారుణం చోటు చేసుకుంది. దస్నాపూర్‌ సమీప అటవీ శివారులోకి మేత కోసం వచ్చిన నీల్గాయిని గ్రామానికి చెందిన కొందరు  హతమార్చారు. వేట కుక్కలతో వెంబడించి కొట్టి చంపారు. ఈ సంఘటన ఉదయం పూటనే జరిగినా బయటికి పొక్కకుండా నీల్గాయి కళేబరాన్ని సమీప అటవీ ప్రాంతంలో దాచి పెట్టారు. సాయంత్రం రహస్యంగా దాని తల వేరు చేశారు.

గ్రామ శివారులో ముక్కలుగా కోసి సుమారు 70 పోగులు పెట్టారు. మాంసం కొందరి వ్యక్తులకు అందకపోవడంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. కుశ్నపల్లి అటవీ రేంజ్‌ అధికారి అప్పలకొండ సూచన మేరకు బీట్‌ అధికారి మధూకర్, స్ట్రైకింగ్‌పోర్స్, బేస్‌క్యాంప్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. నీల్గాయి తల, గంజులో పట్టిన రక్తం, కాళ్లు, పేగులు స్వాధీనం చేసుకున్నారు. దస్నాపూర్‌కు చెందిన చిడెం బానయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రేంజర్‌ అప్పలకొండ తెలిపారు. నీల్గాయిని హతమార్చిన మరి కొందరు పరారీలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top