‘ఉపాధిహామీ’లో కొత్త పనులు.. | new works in employment guarantee scheme | Sakshi
Sakshi News home page

‘ఉపాధిహామీ’లో కొత్త పనులు..

Nov 26 2014 3:38 AM | Updated on Sep 5 2018 8:24 PM

ఉపాధి హామీ పథకం కింద 2015-16 ఆర్థిక సంవత్సరానికి...

 మోర్తాడ్ : ఉపాధి హామీ పథకం కింద 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త పనులను గుర్తించి ప్రణాళికను తయారు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. పనుల గుర్తింపునకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసింది. కొత్త పనుల గుర్తింపునకు మండల స్థాయిలో మూడు బృందాలను ఏర్పాటు చేశారు.

క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ఉపాధి పనుల ద్వారా ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలిగించే పనులను బృందాలు గుర్తించాల్సి ఉంది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అధికారి, ఉపాధి హామీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ అధికారుల ఆధ్వర్యంలో పనుల గుర్తింపునకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలిగించే 35 రకాల పనులపై దృష్టి సారించాలని గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.

జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల్లో గత సంవత్సరం గుర్తించిన పనుల్లో 2,75,365 పనులకు సాంకేతిక ఆమోదం లభించింది. ఇప్పుడు కూడా ఇంచు మించు అదే స్థాయిలో పనులను గుర్తించడానికి బృందాలు కసరత్తు చేస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కల పెంపకం, ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం, ఫీడర్ ఛానల్స్ మరమ్మతులు, వర్షం నీరు వృథాగా పోకుండా దానిని పరిరక్షించడం కోసం ఏర్పాట్లు చేయడం, గ్రామాల్లో ఉన్న రోడ్లపై గుంతలు ఏర్పడితే వాటిని పూరించడం, ప్రభుత్వ విభాగంలోని కార్యాలయాల ఆవరణల్లో గుంతలు ఉంటే పూడ్చటం, సాగునీటి వసతి, పశువులు నీటిని తాగడానికి కుండీలను నిర్మించడం, వ్యవసాయ క్షేత్రాల్లో ఫ్లాట్‌ఫాంలను నిర్మించడం, బీడు భూముల అభివృద్ధి, పండ్ల మొక్కలను నాటి వాటిని పరిరక్షించడం తద్వారా ఉపాధికి ఊతమివ్వడం తదితర రకాలైన 35 రకాల పనులను చేపట్టాల్సి ఉంది.

 గతంలో మాదిరిగా ఒకే తరహా పనులను కాకుండా ప్రజలకు ఎక్కువ ప్రయోజనాలను కలిగించే పనులను గుర్తించి వాటి ద్వారా కూలీలకు వంద రోజుల పాటు ఖచ్చితంగా పని కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది. గ్రామ స్థాయిలో వివిధ శాఖల ఉద్యోగులను భాగస్వామ్యం చేసి పనుల గుర్తింపును పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గ్రామంలోని సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో గుర్తించిన పనులు ఆమోదం పొందాల్సి ఉంటుంది.

 గ్రామ స్థాయిలో పనుల గుర్తింపు పూర్తి అయిన తరువాత మండల స్థాయిలో ఆమోదం పొందాల్సి ఉంది. కొత్త పనుల గుర్తింపును త్వరిత గతిన పూర్తి చేసి నిధుల వ్యయంపై అంచనా వేయాల్సి ఉంది. రానున్న ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుండగా ఇప్పుడు గుర్తించిన పనులను అప్పటి నుంచి ప్రారంభించాల్సి ఉంది. నిధుల కేటాయింపు కోసం గుర్తించిన పనులకు ఎంత వ్యయం అవుతుందో అంచనావేయాల్సి ఉంది. సమయం తక్కువగా ఉండటంతో పనుల గుర్తింపునకు అధికారులు వేగంగా దూసుకుపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement