జూన్‌ నెలాఖరుకి కొత్త టీచర్లు!

New Teachers for the month of June - Sakshi

7,414 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తిచేసిన టీఎస్‌పీఎస్సీ

నియామక మార్గదర్శకాలపై విద్యాశాఖ కసరత్తు

వచ్చే నెల మొదటి వారంలో టీచర్ల బదిలీలు?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త టీచర్లను నియమించేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. జూన్‌ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8,792 పోస్టుల భర్తీకి గతేడాది టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టగా, పలు న్యాయ వివాదాల అనంతరం 7,414 పోస్టులకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. మరో 1,378 పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. అయితే వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలంటే ముందుగా టీచర్ల బదిలీలు చేపట్టాల్సి ఉండటంతో విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. సీనియర్‌ టీచర్లకు కేటగిరీ–1 ప్రాంతాలైన పట్టణాలు, పరిసరాల్లోకి బదిలీలు చేసి, కొత్త టీచర్లకు కేటగిరీ–4 ప్రాంతాల్లో (గ్రామీణ ప్రాంతాల్లో) పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది.

ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉండటం, ఎన్నికల కోడ్‌ ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరు తర్వాత పోస్టింగ్‌లకు సంబంధించిన వ్యవహారాలను ప్రారంభించాలన్న ఆలోచనల్లో ఉంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించి జూన్‌ మొదటి వారంలో రేషనలైజేషన్‌ (హేతుబద్ధీకరణ), బదిలీల ప్రక్రియను చేపట్టి జూన్‌ నెలాఖరుకు కొత్త టీచర్లను నియమించే అవకాశం ఉంది. అయితే హేతుబద్ధీకరణ చేయాలా? వద్దా? కేవలం బదిలీలు చేసి పోస్టింగ్‌లు త్వరగా ఇచ్చే డిమాండ్లు వచ్చినప్పటికీ రేషనలైజేషన్‌ చేయకుండా బదిలీలు, పోస్టింగ్‌ చేపడితే అవసరం లేని చోట టీచర్లు ఉండి.. అవసరం ఉన్న చోట టీచర్లు లేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణతోపాటు బదిలీలు చేశాకే కొత్త నియామకాలు చేపట్టాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈలోగా కొత్త టీచర్ల నియామక మార్గదర్శకాలను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top