నయీం అనుచరుడి హల్‌చల్‌!

Nayeem follower seshanna settlements - Sakshi

కల్వకుర్తి, అమన్‌గల్‌లో శేషన్న సెటిల్‌మెంట్లు

నయీం బినామీ ఆస్తులన్నీ దక్కించుకుంటున్న వైనం

అచ్చంపేట, కల్వకుర్తిలోని ప్రజాప్రతినిధులతో చెట్టపట్టాల్‌

పాలమూరులోని ఇద్దరు పోలీస్‌ అధికారులతో మిలాఖత్‌

శేషన్న ఆచూకీ తెలియదంటూ తప్పించుకుంటున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత.. అతని అనుచరుల కదలికలు పెద్దగా లేవు. నయీం హతమై రెండేళ్లు గడిచింది. ఇప్పుడు అతని అనుచరుడు శేషన్న విశ్వరూపం చూపిస్తున్నాడు. నయీం చేసిన దందాలు, సెటిల్‌ మెంట్లు, కూడబెట్టిన ఆస్తులు, ఇతరత్రా అన్నీ ఇతని కనుసన్నల్లోనే ఉన్నట్టు చెప్పుకుంటారు. అందుకే నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన రెండేళ్ల తర్వాత దందాలు మొదలుపెట్టాడు. ఎల్బీనగర్‌లోనే ఉంటూ కల్వకుర్తి, అమన్‌గల్, అచ్చంపేట్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో కార్యకలాపాలను విస్తృతం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  

నయీం గ్యాంగంతా అతడి వెనుకే...
నయీం రెండు రకాలుగా గ్యాంగ్‌ను నడిపాడు. ఒకటి తన గురించి తెలిసిన కుటుంబీకులతో, రెండోది తనతో ముందు నుంచి ఉన్న అనుచరులతో.. ఎన్‌కౌంటర్‌ తర్వాత అతడి కుటుంబీకులు మొత్తం సైలెంట్‌ అయిపోయారు. కొందరు జైల్లో ఉంటే మరికొందరు అజ్ఞాతంలో గడుపుతున్నారు. కానీ అనుచర వర్గంగా ఉన్నవారంతా మళ్లీ రంగంలోకి దిగారు. అనుచరులుగా ఉన్న 16 మంది గ్యాంగ్‌లో నంబర్‌ 2గా ఉన్న శేషన్నతో చేతులు కలిపినట్టు మహబూబ్‌నగర్‌ పోలీస్‌ వర్గాలు స్పçష్టం చేశాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొం డలో బినామీ ఆస్తులను ఒక్కొక్కటిగా క్లియర్‌ చేసుకుంటూ శేషన్న ఆర్థికంగా బలపడుతూ మళ్లీ దందాలోకి దిగినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.
 
అతని వెంటే ప్రజాప్రతినిధులు..
నయీం ఎన్‌కౌంటర్‌ మరుసటి రోజు నుంచి ఎల్బీనగర్‌లో ఉన్న ఎంపీపీ ఇంటి పక్కన అపార్ట్‌మెంట్‌లోనే శేషన్న షెల్టర్‌ తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి అక్కడే ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాడని తెలిసింది. అచ్చంపేట ప్రాంత ఓ ప్రజాప్రతినిధి, మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్, డీఎస్పీ, కల్వకుర్తికి చెందిన మరో ప్రజాప్రతినిధితో కలసి శేషన్న సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. నయీం బినామీల ఆస్తులను శేషన్న ద్వారా దక్కించుకునేందుకు కొందరు ప్రజాప్రతినిధులు, పోలీస్‌ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.  

ఆచూకీ తెలియడంలేదు...
శేషన్న ఎక్కడున్నాడని పోలీస్‌ అధికారులను ప్రశ్నిస్తే ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అతను మాత్రం బహిరంగంగానే తిరుగుతున్నాడు. పైగా పోలీస్‌ అధికారులు, ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే దందాలు చేస్తుండటం అనుమానం కలిగిస్తోంది. నయీం ఎన్‌కౌంటర్‌లో కీలక సమాచారం ఇచ్చినందుకే శేషన్నను వదిలిపెట్టినట్లు పోలీస్‌ శాఖలో చర్చ జరుగుతోంది.  

నలుగురు రియల్టర్లకు బెదిరింపులు..
కల్వకుర్తి, షాద్‌నగర్‌లో రియల్‌ ఎస్టేట్‌ చేస్తున్న నలుగురు వ్యాపారులను ఇటీవల శేషన్న బెదిరించినట్లు తెలిసింది. నయీం గతంలో కబ్జా చేసిన భూములను విక్రయించేందుకు మళ్లీ రియల్టర్లు ప్రయత్నం చేయడమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై రియల్టర్లు ఓ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఆ ఎమ్మెల్యే శేషన్నకు దగ్గరగా ఉన్న ఓ ఎంపీపీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. శేషన్న జోలికి రావద్దని ఎంపీపీ కూడా ఎమ్మెల్యేకు వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలిసింది. రాచకొండ పరిధిలోని మల్కాజ్‌గిరి జోన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ విషయంలోనూ శేషన్న బెదిరింపులకు పాల్పడినట్లు ఓ సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top