మసక ‘ముద్ర’ | mudra scheme not work properly | Sakshi
Sakshi News home page

మసక ‘ముద్ర’

Feb 15 2018 4:35 PM | Updated on Apr 3 2019 8:09 PM

mudra scheme not work properly - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ :  సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలను స్థాపించుకునేందుకు, నిలదొక్కుకునేందుకు, విస్తరించుకునేందుకు ఆర్థిక చేయూతగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం జిల్లాలో మసకబారి అభాసుపాలవుతోంది. ఈ పథకం ప్రారంభమైన మూడేళ్లలో జిల్లాలో ఇచ్చింది అరకొర మాత్రమే. ఈ రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు నిరాసక్తత చూపిస్తున్నారు. రికవరీ జరగడం లేదా మరేమో గానీ ‘ముద్ర’ మాటెత్తడానికే బ్యాంకర్లు ఆసక్తి కనబర్చడం లేదు. బడా వ్యాపారులు బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టినా చోద్యం చూసే బ్యాంకర్లు చిరువ్యాపారులపై మాత్రం కఠినంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

ఇచ్చింది అరకొరే.. 
మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) కింద కేంద్ర ప్రభుత్వం ఏటా పెద్ద ఎత్తున రుణాలు ప్రకటిస్తుంది. నాబార్డ్‌ ద్వారా ప్రకటించే జిల్లా వార్షిక ప్రణాళికలోనూ వ్యవసాయ పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణలక్ష్యం తర్వాత ఎంఎస్‌ఎంఈ కింద పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుంది. ముద్ర రుణాలు కూడా ఇందులో భాగమే. ఈసారి ఎంఎస్‌ఎంఈ కింద జిల్లాకు మరో 10 శాతం రుణ లక్ష్యం పెంచారు.  ముద్ర రుణాలను 2015 ఏప్రిల్‌ 8న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మూడేళ్లలో జిల్లాలో ఇచ్చింది అరొకర మాత్రమే. ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఆ రంగంలో రాణించేందుకు వీలుగా మూడు వేర్వేరు పథకాలు శిశు కింద రూ.50వేలు, కిశోర్‌ కింద రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు, తరున్‌ కింద రూ.10లక్షల వరకు రుణాలు అందజేసే వీలుంది. శిశు కింద కొత్త రుణాలు ఇవ్వడం, కిశోర్‌ కింద వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు, తరుణ్‌ కింద నిలదొక్కుకొని వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలను బట్టి ఈ రుణాలు ఇవ్వాలి. ప్రధానంగా ముద్ర రుణాలకు సంబంధించి బ్యాంక్‌ వారీగా టార్గెట్లు ఉండడంతో జిల్లా లక్ష్యం ఎంత అన్నదానిపై స్పష్టతలేదు. అయితే ముద్ర రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముభావం ప్రదర్శిస్తున్నారని పలువురు చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు, షూరిటీలు అవసరం లేకుండానే సొంతపూచికత్తుపై ఈ రుణాలు ఇచ్చే వీలుంది. బ్యాంకులకు వెళ్తున్న పలువురు వ్యాపారులకు బ్యాంకర్ల నుంచి మొండి చెయ్యే ఎదురవుతుంది. అనేకమార్లు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేసినా కనికరించడం లేదు. దీంతో చేసేదేమి లేక వారు నిరాసక్తతతో వెనుదిరుగుతున్నారు.  

డీఎల్‌ఆర్‌సీలో చర్చ.. 
ఇటీవల రాష్ట్ర మంత్రి జోగురామన్న, కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అధ్యక్షతన బ్యాంకర్లతో నిర్వహించిన జిల్లాస్థాయి రివ్యూ కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశంలో ముద్ర రుణాలపై చర్చకొచ్చింది. ప్రధానంగా ఈ రుణాలివ్వడంలో బ్యాంకర్ల తీరుపై డీఎల్‌ఆర్‌సీ విస్మయం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం గడువు మరో నెలన్నరలో ముగియనున్న నేపథ్యంలో అప్పటికైనా కొంత పరిస్థితిలో మార్పు రావాలని హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా ప్రతీ బ్యాంకు ఫిబ్రవరిలో ఐదు అకౌంట్లు, మార్చిలో మూడు అకౌంట్లు ముద్ర రుణాలవి తెరవాలని చెప్పడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 2,560 అకౌంట్లు ముద్ర రుణాల కింద ఉన్నాయి. ఒకవేళ డీఎల్‌ఆర్‌సీ సమావేశానికి అనుగుణంగా కొత్త అకౌంట్లు తెరిచిన పక్షంలో ఈ సంఖ్య 3,288కి పెరిగే అవకాశం ఉంది.

ఎంఎస్‌ఎంఈ కింద రుణ లక్ష్యం.. 
2017–18    రూ. 144.62 కోట్లు 
2018–19    రూ. 161.56 కోట్లు 
పెరిగిన శాతం    10.55 శాతం  

ముద్ర రుణాలు.. (మూడేళ్లలో రుణం, అందజేసిన అకౌంట్ల వివరాలు) 
స్కీం    అకౌంట్లు    ఇచ్చిన రుణం (రూ.కోట్లలో)
శిశు    1345    6.64
కిషోర్‌    1177    17.05
తరున్‌    38    2.71 
మొత్తం    2560    26.41

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement