భూమిపై పడే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి... రైతులకు సాగునీటి కొరత తీర్చేందుకు... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పనులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు.
టవర్‌సర్కిల్ : భూమిపై పడే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి... రైతులకు సాగునీటి కొరత తీర్చేందుకు... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పనులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. జిల్లాలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల డివిజన్ల పరిధిలో 5,939 చెరువులను ఐదేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. మొదటి సంవత్సరం 1,188 చెరువులు పునరుద్ధరించాలని నిర్ణయించి, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అన్ని చెరువులకు యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు పూర్తిచేయాలని ప్రభుత్వం ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించింది. నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ సర్వే పనుల్లో ఆలస్యంతో మిషన్ కాకతీయ మొదటి సంవత్సరం పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరో ఐదు నెలల్లో వర్షాకాలం రానుండగా పనుల్లో ఆలస్యం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.
నత్తనడకన సర్వే
డిసెంబర్‌లో ప్రారంభంమైన చెరువుల సర్వే, ప్రణాళిక రూపకల్పన వేగంగా జరగడం లేదు. నీటి పారుదలశాఖలో సిబ్బంది కొరతే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే ప్రణాళికలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినా సాధ్యం కాకపోవడంతో మార్చి నెలాఖరు వరకు గడువు పొడిగించారు. మూడు నెలల్లో ఇప్పటివరకు 781 చెరువులు గుర్తించి 590 చెరువులకు మాత్రమే ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడు నెలల్లో సగం చెరువులకు కూడా ప్రణాళికలు పూర్తికాకపోవడం, ఇంకా నెలా పది రోజుల గడువు మాత్రమే ఉండడంతో అధికారులు హైరానా పడుతున్నారు.
25 పనులకే టెండర్లు పూర్తి
నిధులు మంజూరైన చెరువుల పునరుద్ధరణకు వెంటనే టెండర్లు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే 590 చెరువులకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించగా, 341 చెరువులకు నిధులు మంజూరు చేసింది. ఇందులో కేవలం 107 చెరువులకు మాత్రమే అధికారులు టెండర్లు పిలిచారు. ఇందులో 88 పనులకు టెండర్లు అప్‌లోడ్ చేసి 25 చెరువుల టెండర్లు పూర్తి చేశారు. ఎక్కడా పనులు ప్రారంభించకపోయినప్పటికీ 9 టెండర్లకు సంబంధించి వర్క్ ఆర్డర్లను కాంట్రాక్టర్లకు అందించారు. డిసెంబర్ 31న మొదటి దఫాలో 29 చెరువులకు రూ.13.46 కోట్లు మంజూరు కాగా ఆ తర్వాత దశల వారీగా 12 జీవోల ద్వారా ఇప్పటి వరకు 341 చెరువులకు రూ.120.27 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
నేడు మిషన్ కాకతీయపై సదస్సు
మిషన్ కాకతీయ పనుల వేగం పెంచేందుకు, అధికారుల్లో నెలకొన్న స్తబ్ధత తొలగించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు గురువారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఎల్‌ఎండీలో నీటిపారుదల ఇంజినీరింగ్ ఉద్యోగులతో సదస్సు నిర్వహించనున్నారు. మిషన్ కాకతీయ లక్ష్యం, అధికారులు చేయాల్సిన పనులు, రైతులకు ఒనగూరే ప్రయోజనాలు తదితర అంశాలపై సదస్సులో మంత్రి వివరించనున్నారు. మంత్రి వస్తుండడంతో అధికారుల్లో హడావుడి మొదలైంది. ఇప్పటివరకు ప్రగతిపై సమీక్షించే అవకాశాలుండడంతో అధికారులు నివేదిక తయారీలో తలమునకలయ్యారు.