ఇంగ్లండ్‌లో ప్రైవేటు వైద్యమే లేదు

Minister Lakshma reddy Attends Sons Convocation In England - Sakshi

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి

లండన్‌లో పలు ఆసుపత్రుల సందర్శన

కుమారుడి స్నాతకోత్సవానికి హాజరైన మంత్రి దంపతులు   

సాక్షి, హైదరాబాద్ ‌: ఇంగ్లండ్‌లో ప్రైవేటు వైద్యమే లేదని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. వారంరోజులుగా ఆ దేశంలో పర్యటిస్తున్న ఆయన, బుధవారం పలు ఆసుపత్రులను అధ్యయనం చేశారు. లండన్‌లోని జార్జ్‌ ఎలియట్‌ హాస్పిటల్, లండన్‌ యూనివర్సిటీ హాస్పిటల్, ఎన్‌హెచ్‌ఎస్‌ ట్రస్ట్‌ యూనివర్సిటీ హాస్పిటల్, కాన్వెంటీ అండ్‌ వార్విక్‌ షైర్‌ హాస్పిటళ్లని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు.

చికిత్స పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి వైద్య ప్రముఖులతో చర్చించారు. క్యాన్సర్‌ వంటి వ్యాధుల మీద అక్కడి వైద్యులు కనబరుస్తున్న శ్రద్ధను పరికించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, వైద్యం విశ్వవ్యాప్తం అయిందన్నారు. రోగాలు, వైద్య చికిత్సలలో కొన్ని తేడాలు ఉన్నాయన్నారు. అయితే, మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రపంచంలో ఎక్కడ మెరుగైన పద్ధతులు ఉన్నా వాటిని అనుసరించడం మంచిదే అన్నారు. అందుకే తాము లండన్‌లో ఆసుపత్రులను సందర్శించామన్నారు.

ఆ దేశంలో ప్రతి ఐదు వేల మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉన్నారన్నారు. తెలంగాణని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్‌ తపన పడుతున్నారన్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి వైద్యాన్ని మన రాష్ట్రంలో అందిస్తున్నామని, ఇంకా మెరుగైన, సమర్థ వంతమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు అధికారిక విదేశీ పర్యటనలు చేసి సొంత పనులు చూసుకునే వారని, తాను సొంత పనుల మీద, సొంత ఖర్చులతో విదేశాలకు వెళ్లి ఆసుపత్రులను పరిశీలించానని అన్నారు.  

కుమారుడి డిగ్రీ స్నాతకోత్సవానికి హాజరు
మంత్రి లక్ష్మారెడ్డి కుమారుడు స్వరణ్‌కుమార్‌రెడ్డి గ్రాడ్యుయేషన్‌ స్నాతకోత్సవం లండన్‌లో జరిగింది. దీనికి లక్ష్మారెడ్డి, ఆయన సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. కాగా స్వరణ్‌ లండన్‌లోని వార్విక్‌షైర్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదివారు. ఆ వర్సిటీ స్నాత కోత్సవ ఉత్సవంలో స్వరణ్‌కు డిగ్రీ ప్రదానం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top