సమీపిస్తున్న మేడారం మహా జాతర

Medaram Sammakka Saralamma Jatara Approaching In Joint Warangal District - Sakshi

మిగిలింది 147 రోజులే..

అభివృద్ధి పనులు, ఏర్పాట్లలో కానరాని వేగం

ప్రతిపాదనల తయారీతోనే కుస్తీ పడుతున్న అధికారులు

చివరి నిమిషంలో పనులతో నాణ్యతకు తిలోదకాలు

ప్రజాప్రతినిధులు ఇకనైనా మేల్కొనకపోతే అంతే..

సాక్షి, తాడ్వాయి: మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరకు ఇంకా 147 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆరు నెలల ముందుగానే జాతర జపం మొదలు.. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధుల కేటాయింపు ప్రతిపాదనలు.. జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలు ఇంత చేసి ముందుగానే పనులు ప్రారంభిస్తారని అనుకుంటే అలా జరగడం లేదు. జాతర సమీపించాక అధికారులు పనులు మొదలు పెట్టడం... అప్పటికే భక్తులు వస్తుండడంతో తూతూ మంత్రంగా పనులు చేపట్టి నాణ్యతకు తిలోదకాలు ఇస్తుండడం ఆనవాయితీగా మారింది. ఈ సారి కూడా సమయం సమీపిస్తున్నా పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో గత పరిస్థితులే పునరావృతమవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిపాదనల తయారీలో కుస్తీ
జాతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సవరణ ప్రతిపాదనల జాబితా సమర్పించాల్సి ఉంది. ఇది ఇప్పటి వరకు జరగకపోవడంతో నిధుల కేటాయింపులో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో జాతర అభివృద్ధి పనులు అధికారులు అనుకునే సమయానికి ముందుకుగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కొత్తగా ములుగు జిల్లా ఏర్పాటైన తరుణంలో జాతర ఏర్పాట్ల పనులు ఆరునెలల ముందుగానే ప్రారంభించాలని నిర్ణయించారు. పూజారుల సంఘం జాతర తేదీలు ఖరారు చేసిన తర్వాత మే 3న జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. మరోసారి జూలై నెలలో జాతర ఏర్పాట్లపై మేడారంలో సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించగా, మరోసారి ములుగులోని కలెక్టరెట్‌లో జాతరపై సమీక్షించారు.

ఇక ఆగస్టు 14న జాతర శాశ్వత అభివృద్ధి పనుల్లో భాగంగా భూసేకరణ కోసం సమావేశం నిర్వహించారు. హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం కలెక్టర్, పీఓతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఇటీవల హైదరాబాద్‌లో కూడా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ జాతరలో భక్తుల ఏర్పాట్లపై, అభివృద్ధి పనుల ప్రతిపాదనలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఇక జాతర ఏర్పాట్లపై మంత్రి దయాకర్‌రావు అధికారులు, పూజారులతో మేడారంలో సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఇంకా తేదీ ఖరారు కాలేదు. ఫలితంగా ప్రతిపాదనల ఖరారు, నిధుల మంజూరు.. పనుల ప్రారంభం పనులు ముందుకు సాగకపోవడంతో భక్తులు, పూజారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ప్రతిపాదనల్లో కోత
మేడారం జాతర అభివృద్ధి పనులు, ఏర్పాట్ల కోసం జిల్లా అధికార యంత్రాంగం రూ.175 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు సమర్పించగా.. ప్రతిపాదనలను తగ్గించి శాశ్వత అభివృద్ధి పనులకు ప్రతిపాదనల జాబితా రూపొందించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. దీంతో శాఖల వారీగా అధికారులు ప్రతిపాదనలు తగ్గించే పనిలో నిమగ్నమయ్యారు. గత వారం ములుగు జిల్లా కలెక్టర్‌ నారాయరణరెడ్డి శాఖల అధికారులతో సమీక్షించారు. మరోసారి మేడారానికి వెళ్లి పనుల ప్రదేశాలను పక్కాగా పరిశీలించి ప్రతిపాదనల జాబితా ఫైనల్‌ చేయాలని ఆదేశించడంతో అధికారులు పరిశీలించారు.

9నెలల ముందే తేదీల ఖరారు
వచ్చే ఏడాది 2020 ఫిబ్రవరి 5 నుంచి 8వత తేదీ వరకు సమ్మక్క – సారలమ్మ జాతర జరగనుంది. ఈ తేదీలను పూజారుల సంఘం బాధ్యులు ఈ ఏడాది ఏప్రిల్‌ 20న ప్రకటించారు. అంటే తొమ్మిది నెలల ముందుగానే తేదీలు ఖరారు చేశారు. పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి సమయం ఉండాలనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు నెల రోజుల ముందుగా అంటే ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు జాతర అభివృద్ధి పనులు పూర్తి కావాలి. అయితే, తేదీలు ప్రకటించి ఐదు నెలలు కావొస్తున్నా ప్రతిపాదనల దశే దాటలేదు. 

కొత్త పనులు చేపట్టాల్సిందే..
జాతరలో ఈసారి కొత్తగా స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, తాగునీటి కోసం పైపులైన్ల ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం పనులు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ని«ధులు మంజూరై.. పనులకు అంచనా ఖరారు చేసి టెండర్లు నిర్వహించి అగ్రిమెంట్‌ జరగాలి. ఆ తర్వాత పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సామగ్రి తెప్పించి పనులు మొదలు పెట్టడానికి కనీసం నెల రోజుల సమయం పడుతోంది. అంటే ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే అక్టోబర్, నవంబర్‌ వరకు ఈ తంతంగం కొనసాగే అవకాశముంది. అంతలోనే డిసెంబర్‌ మొదటి వారం నుంచి భక్తుల రాక మొదలవుతోంది. ఈలోపు సంక్రాంతి సెలవులు వస్తాయి. దీంతో భక్తుల రాక పెరుగుతోంది. రోజుకు వేల సంఖ్యలో వచ్చివెళ్తుంటారు. ఈ మేరకు నాణ్యతను విస్మరించి హడావుడిగా పనులు చేపట్టి రూ.కోట్ల నిధులను ఎప్పటిలాగే స్వాహా చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే గత జాతరలో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్, డార్మిటరీ భవనం, ఐటీడీఏ గెస్ట్‌ హౌస్‌ ఆవరణలో నిర్మించిన శాశ్వత మరుగుదొడ్లు, కాటేజీల ముందు నిర్మించిన సులభ్‌ మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top