సంక్రాంతికే ఉల్లి దిగొచ్చేది!

Market Committees Estimates Onion price Will Reduce By Sankranthi Festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉల్లి ధరలు మరో నెల రోజుల పాటు ఆకాశంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దేశీయ మార్కెట్‌లో ఉల్లి డిమాండ్‌ ఎక్కువగా ఉండటం, సరఫరా లేకపోవడంతో ఇప్పట్లో ధరలు సాధారణ స్థాయికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఉల్లి ధర, డిమాండ్‌ నేపథ్యంలో మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుత యాసంగి సీజన్‌లో సాగు పెరగడం, మరో పదిపదిహేను రోజుల్లో కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి రానుండటంతో సంక్రాంతి నాటికి ఉల్లి కిలో ధర వంద రూపాయల దిగువకి వచ్చే అవకాశం ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఫిబ్రవరికే సాధారణ ధర
దేశ వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో ఉల్లికి తీవ్ర కొరత ఏర్పడింది. రోజువారీ ఉల్లి సరఫరా గత ఏడాది 3 లక్షల నుంచి 3.5 లక్షల క్వింటాళ్ల మేర ఉండగా.. ఈ ఏడాది 1.17 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా ధర రూ.180–220కి చేరగా, రాష్ట్రంలోనూ రూ.160–180 పలుకుతోంది. అయితే ఉల్లి ధరలు పెరగడం, యాసంగికి నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో మహారాష్ట్రలో ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.

ఖరీఫ్‌లో 2.50 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ సీజన్‌లో 4 లక్షల హెక్టార్లకు మించి సాగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాగైన ఉల్లి దిగుబడులన్నీ జనవరి మాసాంతం వరకు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఆలోగానే కేంద్రం టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్న 11 వేల మెట్రిక్‌ టన్నులు, ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటున్న 6,090 మెట్రిక్‌ టన్నుల ఉల్లిగడ్డ విదేశాల నుంచి జనవరి రెండో వారంలోగా దేశానికి పూర్తిగా చేరుకుంటుంది. అప్పటివరకు విదేశాల నుంచి విడతలవారీగా ఉల్లి దేశానికి చేరినా ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.

వచ్చే పదిహేను ఇరవై రోజుల్లో ఉల్లి ధర రూ.80–110 వరకు తగ్గే అవకాశం ఉందని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి నాటికి ఉల్లి ధర రూ.50–80 మధ్య, ద్వితీయార్ధంలో రూ.35–60 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరిలో మహారాష్ట్ర నుంచి ఉల్లి సరఫరా పెరిగే అవకాశాలు ఉండటం.. నారాయణఖేడ్, వనపర్తి వంటి ప్రాంతాల నుంచి ఉల్లి మార్కెట్‌కు వచ్చే అవకాశాలు.. కర్నూలు, కర్ణాటక నుంచి దిగుమతులు పెరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో రాష్ట్రంలో ఉల్లి ధర రూ.20–30కి సాధారణ స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు.  

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదీ బిర్యానీకి కూడా ఉల్లి సెగ తగిలింది. చాలా హోటళ్లు బిర్యానీలో ఉల్లి వాడకాన్ని బాగా తగ్గించాయి. ప్రముఖ హోటళ్ల బిర్యానీలు సైతం రుచిని కోల్పోయాయని పలువురు ఆహార ప్రియులు పేర్కొంటున్నారు. ఉల్లి లేకుండా బిర్యానీ వండాల్సిన పరిస్థితి రావడం ఇదే తొలిసారి అని హోటళ్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top