మార్కెట్‌ ఏజెంట్ల బ్యాంకు గ్యారెంటీల సవరణ | Market agents Amendment of bank guarantees | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ ఏజెంట్ల బ్యాంకు గ్యారెంటీల సవరణ

Mar 30 2018 3:17 AM | Updated on Mar 30 2018 3:17 AM

Market agents Amendment of bank guarantees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ కూరగాయలు, పండ్ల మార్కెట్లలో కమీషన్‌ ఏజెంట్ల లైసెన్సు రెన్యువల్, ట్రేడర్స్‌ లైసెన్సు రెన్యువల్‌ తదితరాల బ్యాంకు గ్యారెంటీలకు సంబంధించి డిపాజిట్ల సొమ్ములో సవరణలు చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ఏజెంట్లు, ట్రేడర్లకే సవరణ ఉత్తర్వులు అమలవుతాయి. టర్నోవర్‌ కోటి రూపాయల లోపున్న కూరగాయలు, పండ్ల కమీషన్‌ ఏజెంట్ల లైసెన్సు రెన్యువల్‌కు బ్యాంకు గ్యారంటీ రూ.3 లక్షలుండగా, దాన్ని రూ.25 వేలకు తగ్గించారు. రూ.కోటికి పైగా టర్నోవర్‌కు రూ.5 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉంటే, దాన్ని రూ.50 వేలకు తగ్గించారు. ఇక రూ.5 కోట్లకు పైగా టర్నోవర్‌ కలిగిన వారికి రూ.లక్ష గ్యారెంటీగా నిర్ణయించారు. 

ఇతర లైసెన్సుల రెన్యువల్‌కు... 
కూరగాయలు, పండ్లకు సంబంధించి కాకుండా ఇతర లైసెన్సుల రెన్యువల్‌కు రూ.కోటి టర్నోవర్‌ ఉంటే రూ.5 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండేది. దాన్ని రూ.50 వేలకు, కోటికి పైగా టర్నోవర్‌ ఉంటే రూ.లక్ష, ఐదు కోట్లకు పైగా టర్నోవర్‌ ఉంటే రూ.2 లక్షలు బ్యాంకు గ్యారెంటీగా నిర్ధారించారు. ఇక పండ్లు, కూరగాయల ట్రేడ్‌ లైసెన్సు రెన్యువల్‌కు రూ.కోటి టర్నోవర్‌ ఉంటే రూ.లక్ష బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని రూ.25 వేలకు తగ్గించారు. రూ.కోటి టర్నోవర్‌ ఉంటే రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని రూ.50 వేలకు కుదించారు. రూ.5 కోట్ల టర్నోవర్‌ ఉన్న ట్రేడర్ల గ్యారెంటీని రూ.లక్ష చేశారు. పండ్లు, కూరగాయలు కాకుండా ఇతర వాటి ట్రేడ్‌ లైసెన్సు రెన్యువల్స్‌కు కోటి టర్నోవర్‌ ఉంటే రూ.5 లక్షలకు బదులు రూ.50 వేలు, కోటికి పైగా టర్నోవర్‌ ఉంటే రూ.10 లక్షలున్న బ్యాంకు గ్యారెంటీని రూ.లక్షకు కుదించారు. రూ.5 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్న వాటికి రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ కోరారు.
 
ప్రాసెసింగ్‌ లైసెన్స్‌కు..
ఇక ప్రాసెసింగ్‌ లైసెన్సుకు రూ.కోటి నుంచి అంతకుమించి టర్నోవర్‌ ఉంటే రూ.3 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని ఎంత టర్నోవర్‌ ఉన్నా రూ.50 వేలకు కుదించారు. వేర్‌హౌసింగ్‌ లైసెన్సుకు రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉంటే రూ.50 వేలకు తగ్గించారు. మార్కెట్‌ నోటిఫికేషన్‌కు రూ.20 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండగా, దాన్ని రూ.2 లక్షలకు తగ్గించారు. డైరెక్ట్‌ పర్చేజ్‌ సెంటర్‌ (డీపీసీ)కు రూ.10 లక్షల బ్యాంకు గ్యారెంటీని రూ.2 లక్షలకు కుదించారు. జాతీయ పొదుపు సర్టిఫికెట్లను కూడా బ్యాంకు గ్యారెంటీగా చూపొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement