
సాక్షి, నేరేడ్‌మెట్: ‘ఉప్పల్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేసే మహిళకు తన తోటి ఉద్యోగి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ కంపెనీలో చేరిన సమయంలో ఆమెతో పరిచయం పెంచుకున్న అతగాడు తనస్థాయి ఆమెకు మించి ఎక్కువ కావడంతో సూటిపోటి మాటలతో పని సరిగా చేయడం లేదంటూ కసురుకునేవాడు. పని ఎంత బాగా చేసినా ఏదో వంక పెడుతుండటంతో వేధింపులు తట్టుకోలేక ఆ ఉద్యోగి ఆ కంపెనీలో ఎవరికి చెప్పాలో తెలియక ఉద్యోగం వదిలేసేందుకు సిద్ధమైంది.
అదే సమయంలో రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పరిచయం చేసిన మార్గదర్శక్ గురించి తెలుసుకుంది. ఆమె కంపెనీ నుంచి ఇద్దరు మార్గదర్శక్‌లున్నారని తెలుసుకొని వారిని ఆశ్రయించడంతో జరిగిన విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఇటు బాధితురాలి పేరు బయటకురాకుండానే నిందితుడికి శిక్ష పడింది. అంతేకాకుండా బాధితురాలికి మహిళ చట్టాలపై మార్గదర్శక్‌లు అవగాహన కలిగించి మనోధైర్యం కలిగించారు.’ ...ఇలా సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహాకారంతో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రారంభించిన ‘మార్గదర్శక్’ ఐటీ కంపెనీలతో పాటు ఇతర కంపెనీల్లో పనిచేసే మహిళలకు అండగా ఉంటోంది.
కార్యాలయాల్లో వేధింపులకు గురవుతున్న మహిళలకు మనోధైర్యాన్ని కల్పించి మార్గదర్శనం చేస్తున్నారు. తోటి ఉద్యోగులతో సమస్యలున్నా, వేధింపులు ఎదురైనా, ఉన్నతస్థాయి సిబ్బంది దురుసుగా వ్యవహరించినా, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నవారికి కౌన్సెలింగ్‌తో పాటు లీగల్ సలహాలు ఇచ్చేందుకు ఆయా కార్యాలయాల్లోని ఇద్దరు మహిళలకు ‘మార్గదర్శక్’ శిక్షణ ఇస్తున్నారు. 2013లో వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరస్‌మెంట్ యాక్ట్ ప్రకారం ప్రతి కంపెనీలో ఇంటర్నెల్ కంప్లయిట్ కమిటీ(ఐసీసీ)లు ఏర్పాటుచేసినా ఆశించిన తీరులో సత్ఫలితాలు రాకపోవడంతో మార్గదర్శక్‌ను పటిష్టం చేస్తున్నారు.
ఒక్కో కంపెనీ నుంచి ఇద్దరు...
చాలా కంపెనీల్లో ఐసీసీలు సమర్థంగా పనిచేయడం లేదని తేలింది. మహిళా ఉద్యోగిణులకు వేధింపులు జరిగినా, కష్టం ఎదురైనా చెప్పుకునేందుకు తటాపటాయిస్తున్నారు. అందుకే ఐసీసీ కమిటీల్లో తమకు న్యాయం జరుగడంలేదని అనుకున్నా, ఫిర్యాదు చేస్తే నలుగురికి తెలిసి మరో రకంగా అపార్థం చేసుకుంటారని లోలోన కుమిలిపోతున్న వారు తమ భాధలను మనస్ఫూర్తిగా చెప్పేందుకు ‘మార్గదర్శక్’కి శ్రీకారం చుట్టారు.
ఒక్కో కంపెనీ నుంచి ఇద్దరు మహిళా ఉద్యోగిణులను ఎంపిక చేసుకుని వారికి మహిళల చట్టాలపైనా, బాధితులకు ఎలా కౌన్సెలింగ్ ఇవ్వాలి, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లవచ్చ’నే విషయాలపై ఆయా రంగాల్లో అనుభవజ్ఞులతో ఎస్‌సీఎస్‌సీ సహాకారంతో రాచకొండ పోలీసులు శిక్షణ ఇప్పిస్తున్నారు. గత రెండున్నరేళ్ల నుంచి ఇప్పటివరకు సుమారు 80 కంపెనీల నుంచి 160 మందికిపైగా శిక్షణ ఇచ్చారు. మూడు నెలల పాటు షీ టీమ్స్, మహిళా పోలీసు స్టేషన్, భరోసా, షెల్టర్ హోమ్స్ ఉద్యోగులచే ఎనిమిదో మార్గదర్శక్ బ్యాచ్‌కు ట్రైనింగ్ చేశారు. ఈ ట్రైనింగ్ పూరై్తన వివిధ కంపెనీలకు చెందిన 27 మందికి నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సర్టిఫికెట్‌లు శనివారం అందజేశారు.
మార్గదర్శక్‌లు యూనిఫామ్‌లో లేని పోలీసులు
వివిధ కంపెనీలో పనిచేసే మహిళల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే షీ షటిల్ బస్సులు నడుపుతున్నాం. ఐటీ కంపెనీల్లో పనిచేసే మహిళలకు వేధింపులు ఎదురైన సందర్భంగా మార్గదర్శక్‌లు చక్కటి పరిష్కారం చూపిస్తున్నారు. వాళ్లు యూనిఫామలో లేని పోలీసులు. బాధితురాల్లో మనోస్థైర్యాన్ని నింపడంతో పాటు చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలో అవగాహన కలిగిస్తారు. ఆత్మహత్యలు తగ్గడంలో వీరిది కీలకపాత్ర ఉంటుంది. ఐసీసీలో న్యాయం జరగదని అనుకుంటే మార్గదర్శక్‌లను సంప్రదించడం మేలు. ఈ విధంగా గత రెండున్నరేళ్ల నుంచి మార్గదర్శక్ ద్వారా వచ్చిన చాలామటుకు ఫిర్యాదుల్లో నిందితులను శిక్షించాం.
–మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్