జిల్లాలో ‘మావో’ల కదలికల కలకలం

Maoists Information In Warangal - Sakshi

 అప్రమత్తమైన పోలీసు శాఖ

సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా

ఊరూరా.. యాక్షన్‌ టీం సభ్యుల పోస్టర్లు

ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి ప్రకటన

సాక్షి, భూపాలపల్లి: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మొన్నటి వరకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, నకిలీ మందుపాతరలు అలజడి సృష్టించాయి. తాజాగా అధికార పార్టీ నాయకులే లక్ష్యంగా యాక్షన్‌ టీం జిల్లాలో ప్రవేశించిందన్న సమాచారంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. టీంలోని సభ్యులకు సంబంధించిన ఫొటోలతో పోస్టర్లు ముద్రించి ఊరూరా అతికిస్తున్నారు. ప్రత్యేక బలగాలతో సోదాలు, కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. అడవులను జల్లెడ పడుతున్నారు. పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.

జిల్లాలో మావోయిస్టు కొరియర్‌లు..
సానుభూతిపరుల కదలికలు ఎక్కువయ్యాయి. వాజేడు, వెంకటాపురం, పలిమెల, మహదేవపూర్, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాలు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉండడంతో మావోలు తెలంగాణ ప్రాంతంలోకి రాకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరంతరం నిఘా ఉండేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన, వాజేడు, ఏటూరునాగారం మధ్య ఉన్న ముల్లకట్ట వంతెన వద్ద, వెంకటాపూర్, మంగపేట మండలాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా తాడ్వాయి, పస్రా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్‌ టీం కదలికలు ఉన్నాయని తెలియడంతో పోలీసు బలగాలతో అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవల బాంబు స్క్వాడ్‌ ఏటూరునాగారం నుంచి మంగపేట వెళ్లే రహదారిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో భద్రతా చర్యలు చేపట్టడానికి ఎనిమిది కంపెనీల ప్రత్యేక బలగాలు జిల్లాకు చేరుకున్నాయి.

సరిహద్దు జిల్లాలపై నజర్‌?
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుకుమా, కాంకేర్, నారాయణపూర్‌ జిల్లాలోని 18 నియోజకవర్గాలకు మొదటి విడత ఎన్నికలు ఈనెల 12న ముగిశాయి. ఈ ప్రాంతాలన్నీ నక్సల్స్‌ ప్రాబల్యం ఉన్నవే కావడంతో అడపాదడపా ఘటనలు మినహా అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే తెలంగాణలో ఎన్నికలకు కొంత సమయం ఉండడంతో ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రాణహిత, గోదావరి సరిహద్దున మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, మహారాష్ట్రలోని గడ్చిరోలితో సరిహద్దు ఉంది. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాచలం జిల్లాలకు మావోల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తయ్యారు. జిల్లా పరిధిలోని నియోజకవర్గాల అన్నింటిలో పొలింగ్‌ ను సాయంత్రం నాలుగు గంటల వరకే నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. 

పొరుగు జిల్లాల అధికారులతో సమన్వయం
జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులు సరిహద్దు జిల్లాల అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన భద్రత చర్యలు చేపడుతున్నారు. మావోల వ్యూహాలను ముందుగానే పసిగట్టి ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి ఘటనలకు తావివ్వకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఊరూరా.. యాక్షన్‌ టీం పోస్టర్లు 
ఏటూరునాగారం: కొరియర్ల సహాయంతో మావోయిస్టు యాక్షన్‌ టీం సభ్యుల వివరాలు తెలుసుకున్న పోలీసులు వారికి సంబంధించిన పోస్టర్లను ముద్రించి విడుదల చేశారు. వారి ఆచూకీ చెప్పిన వారికి రూ.5 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటిస్తూ ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో పోలీసులు పోస్టర్లను అంటించారు. అందులోని వ్యక్తులకు సహకరించినా.. ఆశ్రయం కల్పించినా చట్టరీత్యా నేరమని, ఆయా వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ, సీఐ, ఎస్సైల ఫోన్‌ నంబర్లను 
వాటిలో ప్రచురించారు. చాలా రోజుల తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టుర్లు అంటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎం జరుగుతుందోనని వణికిపోతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top