ముందస్తు ఎన్నికలను బహిష్కరించండి 

Maoist party Secretary Haribhushan says Expel the early elections - Sakshi

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ లేఖ 

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ సోమవారం ఓ లేఖలో డిమాండ్‌ చేసింది. సరైన కారణాలు చెప్పకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ శక్తులను ఏకం కాకుండా చేసి ముందస్తు ఎన్నికల్లో నెగ్గేందుకు ఎత్తుగడ వేశారని విమర్శించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారని, బీజేపీతో చేసుకున్న లోపాయికారీ ఒప్పందం బట్టబయలుకావడంతో ఆశించిన రీతిలో ఫ్రంట్‌కు అడుగులు పడలేదన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులు చేసి ప్రతిపక్షాలను బలహీనపరిచారన్నారు. నీళ్లు నిధులు నియామకాలతో ప్రభుత్వంలోకి వచ్చి 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు.  

తెలంగాణ వ్యతిరేకులకు పదవులు.. 
ఏనాడూ ఉద్యమం చేయని, తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడ్డ వారిని మంత్రి మండలిలోకి చేర్చుకొని లక్షల కోట్లు కాంట్రాక్టుల పేరుతో కొల్లగొట్టారన్నారు. టీపాస్‌ పేరుతో పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారని, నీళ్లు, ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించి కోట్ల రూపాయల్లో లాభాలు కల్పించినట్టు హరిభూషణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో 4 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటి నియంత్రణకు చర్యలు చేపట్టకపోవడం, రైతులకు బేడీలు వేసిన ఘనత దేశంలో కేసీఆర్‌కే దక్కుతుందని ఆరోపించారు. రైతుబంధు పథకం ద్వారా భూస్వాములకే ఆర్థిక సహాయం చేస్తూ నిరుపేద రైతులను కేసీఆర్‌ మోసం చేశారన్నారు.  

మహాకూటమి పేరుతో కొత్త డ్రామా 
దేశ రాజకీయాలను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు కొత్తగా మహాకూటమి పేరుతో డ్రామా మొదలుపెట్టి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని హరిభూషణ్‌ విరుచుకుపడ్డారు.  సీపీఐ, సీపీఎంలు పాలక పార్టీలతో అంటకాగుతూ ఏదో ఒక దోపిడీ వర్గానికి బలం చేకూర్చేలా వ్యవహరిస్తూ ప్రజలను విప్లవోద్యమంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలతో పనిచేసిన కోదండరాం ఇప్పుడు దోపిడీ వర్గ పార్టీలకు మేలు చేసేలా వ్యవహరించడం సరైంది కాదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజలు ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని హరిభూషణ్‌ పిలుపునిచ్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top