‘రేషన్‌ డీలర్లు చేసేది సామజిక సేవే’

Legal Metrology Controller Says Consumers Should Aware Of Fraudsters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రేషన్‌ డీలర్లు సామజిక సేవ చేస్తున్నారనే విషయం మరచిపోవద్దు. వారు సమ్మె చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. చర్చల ద్వారా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. కొత్త రేషన్‌ కార్డులను జారీ చేస్తున్నామ’ని తెలంగాణ తూనికలు కొలతల శాఖ కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌ పేర్కొన్నారు. తూనికలు, కొలతల్లో జరిగే మోసాలపై వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కొన్ని రోజుల క్రితం నగరంలోని ఒక స్కానింగ్‌ సెంటర్‌ తప్పుడు పరీక్షల వల్ల ఒక శిశువు, ఆమె కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురయిందని ఆయన తెలిపారు. పాప తల్లిదండ్రులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయిచడంతో.. సదరు స్కానింగ్‌ సెంటర్‌ను దోషిగా తేలుస్తూ ఫోరం 2 లక్షల జరిమానా విధించిందని అన్నారు. ఆ మొత్తాన్ని బాధిత కుంటుంబానికి చెక్కు రూపంలో గురువారం అందజేశారు. 

ఇటీవల నగరంలోని షాపింగ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి 12 కోట్ల రూపాయల వరకు జరిమానాలు విధించామని పేర్కొన్నారు. వస్తు​, సేవల్లో మోసాలకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు వినియోగదారుల సేవా కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రతి వ్యాపారీ అతను అందించే వస్తు, సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడే వ్యాపారులపై వినియోగదారులు 180042500333 టోల్‌ ఫ్రీ నెంబర్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. దోషిగా తేలితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ఉద్ఘాటించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top