లీకులిస్తే జాగ్రత్త!

లీకులిస్తే జాగ్రత్త! - Sakshi


మంత్రులు, అధికారులకు  సీఎం కేసీఆర్ హెచ్చరిక

ప్రభుత్వ నిర్ణయాలు ముందే మీడియాకు తెలిస్తే ఎలాగని ఆగ్రహం

రుణ మాఫీపై మెలికలు పెట్టరాదని కేబినెట్ భేటీలో నిర్ణయం


 

హైదరాబాద్: రుణ మాఫీపై రాష్ర్ట స్థాయి బ్యాంకర్లతో జరిగిన చర్చల వివరాలు మీడియాలో రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నో సమస్యలుంటాయని, వాటిపై అంతర్గతంగా జరిగే చర్చలను బయటకు పొక్కనీయొద్దని హితవు పలికారు. కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలోని సి-బ్లాక్‌లో ఆదివారం రాత్రి 8 గంటలకు కేబినెట్  భేటీ జరిగింది. దాదాపు రెండుగంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రుణ మాఫీపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. లక్ష రూపాయల్లోపు పంట రుణాలను ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం స్థూలంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఎలాంటి మెలికలు పెట్టినా తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి ఉంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణాలను మాఫీ చేయడమే మంచిదని ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ విషయంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలు, సాంకేతికాంశాలను తెలుసుకుని ఆ మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు.



కాగా, రైతుల రుణమాఫీ విషయంలో గత ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తింపజేస్తామంటూ మీడియాలో వచ్చిన వార్తలకు కారణం ఎవరంటూ సీఎం ఈ సందర్భంగా అందరినీ నిలదీసినట్టు సమాచారం. అయితే ప్రభుత్వ సలహాదారుల్లోనే ఒకరు ఈ లీకులు చేశారని ఓ మంత్రి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇకపై కేబినెట్ సమావేశాలకు సంబంధించి ఎలాంటి లీకులు వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేసీఆర్ హెచ్చరించారు. ఎవరు లీకులు ఇస్తారో, ఎవరికి ఇస్తున్నారో, ఎలా ఇస్తున్నారో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. లీకులు ఎవరు ఇచ్చినా సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోకుంటే జాగ్రత్త అని తీవ్ర స్వరంతో అన్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయాలను అధికారికంగా చెప్పేదాకా ఆగకుండా బయట పెడితే రుణమాఫీపై తలెత్తిన పరిస్థితులే ఎదురవుతాయని కేసీఆర్ వివరించారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే మీడియాలో జరిగిన ప్రచారంతో ఆత్మహత్యలు, ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. నిర్ణయం ఏదైనా తీసుకోవడానికి ముందుగా ఎన్నో చర్చలు జరుగుతాయని, అవన్నీ మీడియాలో ఎందుకు రావాలని కేసీఆర్ తన సహచరులను ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా, రాష్ర్ట అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ చేయాల్సిన ప్రసంగ పాఠాన్ని మంత్రివర్గం ఆమోదించింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను, ప్రభుత్వ ప్రాధాన్యతలను, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల అమలుపై వేయబోయే అడుగులు వంటి వాటికి గవర్నర్ ప్రసంగంలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల భర్తీతో పాటు అసెంబ్లీకి నామినేట్ చేయాల్సిన ఆంగ్లో ఇండియన్‌పైనా ఈ సందర్భంగా కేబినెట్ చర్చించింది. ఇక తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసుల ఎత్తివేత, అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా తదితర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ భేటీలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులతో పాటు సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం పేషీ అధికారులు పాల్గొన్నారు. కాగా, తల్లి కర్మకాండల కోసం స్వగ్రామంలోనే ఉన్న విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి మాత్రం దీనికి హాజరుకాలేదు.



 హిమాచల్ ఘటనపై కేబినెట్ దిగ్భ్రాంతి



విజ్ఞాన, విహారయాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్ వెళ్లిన రాష్ర్ట విద్యార్థులు అక్కడి బియాస్ నదిలో గల్లంతవడంపై రాష్ట్ర మంత్రివర్గం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top