ఫోన్‌లో వద్దు ప్లీజ్‌ | Leaders Said Don't Use Phone Please | Sakshi
Sakshi News home page

ఫోన్‌లో వద్దు ప్లీజ్‌

Nov 13 2018 11:28 AM | Updated on Nov 13 2018 11:53 AM

Leaders Said Don't Use Phone Please - Sakshi

జోగిపేట(అందోల్‌): ఈ ఎన్నికల సీజన్‌లో సెల్‌ఫోన్‌లో మాట్లాడాలంటేనే నాయకులు జంకుతున్నారు. ముఖ్య నేతలు ఫోన్‌ల ద్వారా రాజకీయ అంశాలను చర్చించాలన్నా ఇతర విషయాలు మాట్లాడాలన్న వెనుకముందాడుతున్నారు. ఫోన్‌ రికార్డింగ్, ట్యాపింగ్‌ భయం వారిని వేధిస్తోంది. వ్యూహాలు ప్రత్యర్థి పార్టీలకు తెలిసి పోతుందోనన్న హైరానా వారిని వెంటాడుతోంది. ఈ పార్టీ, ఆ పార్టీ అంటూ తేడా లేకుండా అన్ని పార్టీల నేతల్లోనూ ఇదే రకమైన ఆందోళన నెలకొంది. 

సదాశివపేట(సంగారెడ్డి): అసెంబ్లీ ఎన్నికల సందడి సంగారెడ్డి నియోజకవర్గంలో రోజు రోజుకు వేడెక్కుతోంది. ఎన్నికల సమీపిస్తుండడంతో ఓట్లను ప్రభావితం చేసే ఎదుటి పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులను, క్రియశీలక కార్యకర్తలకు గాలం వేస్తున్నారు. పోటీలో నిలిచే అభ్యర్థులు ముఖ్య నాయకులే నేరుగా వారితో లైన్‌లోకి వస్తున్నట్లు సమాచారం.

సంగారెడ్డిలోనూ ‘సెల్‌’ సమస్య..
పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని ఆశపెడుతున్నారు. నయానో, భయానో ముట్టజెప్పి దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరికి ప్రత్యేక ప్యాకేజీలతో ఆఫర్‌ ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో సెల్‌ఫోన్లలో జరిపే చర్చలు, మాటలు బయటకు పొక్కకుండ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఫోన్‌లో కంటే నేరుగా మాట్లాడడానికే మొగ్గు చూపుతున్నారు. అభ్యర్థులకు అత్యంత సన్నిహితంగా ఉండే వారైతే ప్రత్యర్థి నేతల ఫోన్లను లిఫ్ట్‌ చేయాలంటేనే జంకుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

హడలిపోతున్న నేతలు 
కాంగ్రేస్‌ నేతలను ఫోన్‌ ట్యాంపరింగ్‌ వెంటాడుతునే ఉంది. ఇటీవల కాంగ్రెస్‌  ముఖ్య నేతల ఫోన్‌లపై ప్రధానంగా దృష్టికేంద్రీకరించారని, ఏ నేతలు ఎవరెవరితో ఫోన్‌ల ద్వారా సంభాషణలు సాగిస్తున్నారో? రాజకీయాలు నేర్పుతున్నారోనని అధికార పార్టీ పరిశీలిస్తుందని ప్రచారం సాగుతోంది. ప్రగతి భవన్‌లోనే ఈ తంతు జరుగుతుందని ఇటీవల కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో నాయకులు ఫోన్‌లలో మాట్లాడాలంటేనే హైరానా పడుతున్నారు.  రాజకీయ అంశాలు చర్చకు రాగానే ఫోన్‌లను కట్‌ చేసి కలిసినడుప్పుడు మాట్లాడుదామన్నట్లుగా దాటవేస్తున్నారు. జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకుల సెగ్మెంట్‌లో ఫోన్‌ ట్యాంపరింగ్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్య నేతలు అందరూ ఫోన్‌లలో మాట్లాడలంటేనే భయ పడుతున్నారు.

ఎవరెవరీ ఫోన్‌లు ట్యాపింగ్‌ అవుతున్నాయోనన్న అనుమానంతో నేతలు సతమతమవుతున్నారు. కొందరు నేతలైతే ఏకంగా వ్యక్తిగత అంశాలను, వ్యక్తిగ తమైన వ్యవహారాలను చర్చించుకునేందుకు ప్రత్యేక నంబర్లను సైతం తీసుకుంటున్నారు. తాము ఉపయోగించే ఫోన్‌ నంబర్ల ద్వారా రాజకీయాలు, ఇతర అంశాలను మాట్లాడడం మానేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు సైతం ఎవరైన ముఖ్య విషయం కోసం ఫోన్‌ చేస్తే ఎందుకు అన్నా ఫోన్‌లో వద్దు నేరుగా కలుద్దామంటూ ముగిస్తున్నారట. కాల్‌ రికార్డింగ్, ట్యాపింగ్‌ సమస్య వారిని వేధిస్తోంది. ఈ వ్యవహరం అందోలు సెగ్మెంట్‌లో  తీవ్ర చర్చలకు తావులేపుతోంది. 

ప్రతీ విషయం అత్యంత గోప్యం
ప్రధాన పార్టీల అభ్యర్థులు నిధులు సమీకరించుకోవడంలో, ఎన్నికల ప్రచారంలో విధులు పంచుకోవడంలోను అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు తమ ప్రణాళికలు, వ్యూహాలు, బయటపడకుండా చూసుకుంటున్నారు. పోలింగ్‌ నాటికి అవసరమయ్యే ఖర్చులను ఎవరికెంత పంపాలనేది కూడ రహస్యంగానే సమాచారాన్ని సేకరిస్తున్నారు. అత్యంత నమ్మకస్తులతోనే వ్యవహరాలు నడిపిస్తున్నారు. అడుగడుగునా జరుగుతున్న వాహనాల తనిఖీలు, ఎన్నికల అధికారుల నిఘాతో అన్ని పార్టీల్లోను గోప్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చివరకు నాయకులు కార్యకర్తలు ఒకరినొకరు మాట్లాడుకునే సమయంలోనే అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement