వైద్య సంస్కరణలు దేశానికే ఆదర్శం | KTR Says About Health in Telangana | Sakshi
Sakshi News home page

వైద్య సంస్కరణలు దేశానికే ఆదర్శం

Apr 7 2018 1:26 AM | Updated on Apr 7 2018 1:26 AM

KTR Says About Health in Telangana - Sakshi

కేటీఆర్‌కు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న లక్ష్మారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని ఐటీ, పట్టణాభివృద్ధి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో మంత్రి లక్ష్మారెడ్డి చొరవతో ఆరోగ్యశాఖలో గుణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ‘నేను రాను బిడ్డో’ అని పాడుకునే రోజుల నుంచి ‘నేను వస్త బిడ్డో సర్కార్‌ దవాఖానాకు’అనే స్థాయిలో ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్ది, ప్రజలను ఆ వైపు ఆకర్షితులను చేయడం సామాన్య విషయం కాదన్నారు. మల్కాజిగిరి బీజేఆర్‌ నగర్‌లో వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి లక్ష్మారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలసి ఆయన ప్రారంభించారు. 

అనంతరం మాట్లాడుతూ నగరంలో నిరుపేదలకు మరింత మెరుగైన వైద్య సదుపాయలు అందించడానికి బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బీజేఆర్‌ నగర్‌తోపాటు మరో 17 బస్తీ దవాఖానాలు నేటి నుంచి పనిని ప్రారంభిస్తాయన్నారు. మరో నెల రోజుల్లోగా 40 దవాఖానాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నగరంలో ప్రతి 10వేల మందికి ఒక దవాఖానా చొప్పున వెయ్యి బస్తీ దవాఖానాలను దశలవారీగా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ దవాఖానాలు అందుబాటులోకి వస్తే బస్తీ ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందుతాయన్నారు. వైద్యరంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు, పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు తగ్గి, సహజ ప్రసవాలు పెరిగాయని చెప్పారు. 

బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు
మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బస్తీ దవాఖానాలు స్థానిక ప్రజలకు ఆరోగ్య పరమైన సలహాలు ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందిస్తాయన్నారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ పర్యాద కృష్ణమూర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు. ఫలక్‌నుమాలోని హషిమాబాద్, మలక్‌పేట, గడ్డి అన్నారంలలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీలతో కలసి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement