ఇన్వెస్ట్‌.. తెలంగాణ బెస్ట్‌: కేటీఆర్‌

KTR And Harish Rao Launched New Web Site Called Invest Telangana - Sakshi

‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కేటీఆర్, హరీశ్, జగదీశ్‌

సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రస్థానం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సర్కార్‌ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. పెట్టుబడి పెట్టాలనుకునేవారికి అవసరమైన సమాచారాన్ని అందులో పొందుపర్చింది. ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’వెబ్‌సైట్‌ను రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో కలిసి గురువారం ఇక్కడి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సులభతర వాణిజ్య విధానం(ఈవోడీబీ)లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని అన్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికిగాను ప్రోత్సాహక విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

ఇతర రాష్ట్రాలతో స్నేహపూర్వక పోటీని కొనసాగిస్తూనే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ పెట్టుబడిదారులకు అవసరమైన సంపూర్ణ సమాచారం అందజేస్తుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. వెబ్‌సైట్‌లో ఇప్పటికే పలు ప్రభుత్వసేవలకు సంబంధించిన లైవ్‌లింక్‌లు ఉన్నాయని, వీటి ద్వారా పెట్టుబడిదారులు ఆయా సేవలను నేరుగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ భాషల్లోనూ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

పెట్టుబడిదారులకు అవసరమైన సమాచారం
రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సంపూర్ణ సమాచారాన్ని ఐటీ, పరిశ్రమల శాఖలు ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’వెబ్‌సైట్‌లో పొందుపరిచాయి. వెబ్‌సైట్‌కు సంబం«ధించిన సమాచారాన్నిగానీ, ఫీడ్‌బ్యాక్‌నుగానీ invest-telangana@telangana. gov.inకు పంపాలని పరిశ్రమల శాఖ సూచించింది. https://invest.telan gana.gov.in/ లింక్‌ ద్వారా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని వెల్లడించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top