సీఎం రేసులో నేను లేను: కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy Thanks To Rahul Gandhi - Sakshi

సాక్షి, నల్గొండ:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీల్లో తనకు సముచిత స్థానం కల్పించినందుకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అదిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఆయన ఓ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తనపై నమ్మకంతోనే పదవి కట్టబెట్టారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ధైర్యాన్నిచ్చే మేనిఫెస్టో కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిందని తెలిపారు. తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌లా మాట తప్పే తత్వం కాంగ్రెస్‌ పార్టీది కాదని స్పష్టం చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్ని కేసీఆర్‌ విస్మరించారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలను బానిసలుగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేరగాళ్లందరికి టీఆర్‌ఎస్‌లో టికెట్‌లు ప్రకటించారని మండిపడ్డారు. అందరూ ప్రచారం చేస్తున్నట్టు సీఎం రేసులో తాను లేనని.. అది పూర్తిగా అధిష్టానం చేతిలో ఉంటుందన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ పతనం నల్గొండ నుంచే మొదలవుతుందని జోస్యం చెప్పారు. ఇక బుధవారం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీల్లో కొమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి పార్టీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌, మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్‌ పదవులు వరించిన విషయం తెలిసిందే.  

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top