అభినందనల అధినేత | KCR your time at home | Sakshi
Sakshi News home page

అభినందనల అధినేత

May 30 2014 3:33 AM | Updated on Apr 3 2019 8:52 PM

అభినందనల అధినేత - Sakshi

అభినందనల అధినేత

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)కు అభినందనల వెల్లువ సాగుతోంది.

  •      కేసీఆర్ ఇంటి  వద్ద సందడే సందడి
  •      క్యూ కడుతున్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు
  •  సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)కు అభినందనల వెల్లువ సాగుతోంది. గురువారం  బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ అభిమానులు తరలివచ్చి బోకేలతో అధినేతను అభినందించారు.   

    నూతనంగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో తాము అనుకున్నవన్నీ జరుగుతాయని ఉత్సాహంతో పుష్పగుచ్ఛాలందించి కాబోయే ముఖ్యమంత్రిని అభినందించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నాయకులతోపాటు పలుశాఖల కార్యదర్శులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, పలు జిల్లాల కలెక్టర్లు, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు, తెలంగాణ ముస్లిం న్యాయవాదుల సంఘం నాయకులు, పలు వ్యాపారసంస్థల అధిపతులు, పలువురు పారిశ్రామివేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ఉద్యోగ సంఘాల నాయకులు, తెలంగాణ వైద్యుల సంఘం నాయకులు,తెలంగాణ  ట్రెజరి ఉద్యోగులు, తెలంగాణ కళాకారుల సంఘం నాయకులు, తెలంగాణ పోలీసు అధికారుల సంఘం నాయకులు, తెలంగాణ చిన్నపరిశ్రమల సంఘం నాయకులు, పలు ధార్మిక సంఘాల నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, పార్టీ తరఫున గెలిచిన జడ్పీటీసీలు, తెలంగాణ గౌడ సంఘం నాయకులు అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
     
    కల్లు దుకాణాలు తెరిపించేందుకు హామీ

    బంజారాహిల్స్: గ్రేటర్ పరిధిలోని కల్లు దుకాణాలను త్వరలో తెరిపించేలా చర్యలు తీసుకుంటానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నాయకులకు హామీఇచ్చారు. ఈనెల 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న సందర్భంగా కేసీఆర్‌ను అభినందించేందుకు వచ్చిన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సదానందంగౌడ్‌తోపాటు తెలంగాణ గౌడ జేఏసీ కన్వీనర్ వెంకన్నగౌడ్, కోకన్వీనర్లు నారాయణగౌడ్, వేణుగోపాల్‌గౌడ్‌లతో ఆయన మాట్లాడారు.

    గత కాంగ్రెస్ సర్కారు లిక్కర్ మాఫియాతో కుమ్మకై జీవో 767 ద్వారా తెలంగాణవ్యాప్తంగా 1600 కల్లు గీత సొసైటీలను రద్దు చేసిందని, దీనివల్ల కేవలం ఒక్క గ్రేటర్ పరిధిలోనే లక్షా 50వేల మంది ఉపాధి కోల్పోయారని వారు కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా కలిసిన వారిలో శ్రీనివాస్‌గౌడ్, బాలరాజ్, అనిల్‌గౌడ్‌లతోపాటు సుమారు 100 మంది ఉన్నారు.
     
    ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటాం..

    కాచిగూడ: దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, ఈనెల 2న జరిగే ఆయన ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకుంటామని మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) హెచ్చరించింది. గురువారం కాచిగూడ నింబోలిఅడ్డాలోని ఎస్సీ హాస్టల్‌లో బోయిని శ్రీనివాస్ మాదిగ విలేకరులతో మాట్లాడుతూ 2న తెలంగాణ విజయోత్సవ దినం పాటిస్తే, దళితులకు మాత్రం విద్రోహదినమే అవుతుందని అన్నారు. కేసీఆర్‌కు రక్షణ కవచంగా ఉంటామని కొంతమంది దళిత నాయకులు అనడం సిగ్గుచేటన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement