కంది ధర ఢమాల్‌

Kandi price is falling - Sakshi

రైతును నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు

కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.5,450

మార్కెట్లో పలుకుతోంది రూ.2 వేల నుంచి 4 వేల లోపే..

ఇప్పుడిప్పుడే మార్కెట్లకు తరలివస్తున్న పంట.. నెలాఖరు నుంచి జోరుగా..

ఈసారి 1.65 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా

సాక్షి, హైదరాబాద్‌: కంది ధర పతనమవుతోంది. మార్కెట్‌కు వస్తున్న రైతులను ప్రైవేటు వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. అత్యంత తక్కువ ధరకు కంది పంట కొనుగోలు చేస్తున్నారు. 2017–18 సంవత్సరానికి కేంద్రం కందికి ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటాలుకు రూ.5,450 కాగా.. మార్కెట్లలో రూ.4 వేల లోపే ధర పలుకుతోందని సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ తాజాగా తన నివేదికలో ప్రస్తావించడం పరిస్థితికి అద్దం పడుతోంది.

కనిష్టంగా రూ.2 వేలు, గరిష్టంగా రూ.4 వేల వరకే ధర ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరు నుంచి కంది పంట మార్కెట్లలోకి విరివిగా రానుంది. గతేడాది గణనీయంగా ఉత్పత్తి ఉండటంతో డిమాండ్‌ తగ్గి ధర పడిపోయిందని భావించారు. కానీ ఈసారి ఉత్పత్తి తక్కువగా ఉన్నా డిమాండ్‌ పెరగకపోవడంపై రైతులు దిగాలు పడుతున్నారు. ఓవైపు పత్తి ధర పడిపోయి రైతులు హాహాకారాలు చేస్తుంటే.. మరోవైపు కంది కూడా రైతును కుదేలు చేస్తోంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కంది పప్పును దిగుమతి చేసుకోవడం వల్లే ధర పడిపోయిందని కొందరు అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఎక్కడెక్కడ ఎంతెంత ధర..
గతేడాది ఖరీఫ్‌లో కంది విస్తీర్ణం 10.77 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది ఖరీఫ్‌లో కేవలం 6.27 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఈసారి 1.65 లక్షల టన్నులు కంది ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కంది పంట నూర్పిడి డిసెంబర్‌లో మొదలవుతుంది. మార్చి వరకు మార్కెట్‌కు వస్తుంది. ఇప్పటికే కొన్నిచోట్ల మార్కెట్‌కు వచ్చింది. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ గత నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో కందికి ఏ స్థాయిలో ధర పలికిందో వివరిస్తూ నివేదిక విడుదల చేసింది.

దాని ప్రకారం నవంబర్‌ 10న కరీంనగర్‌ మార్కెట్లో కందికి పలికిన గరిష్ట ధర క్వింటాలుకు రూ.3,056 మాత్రమే. అదేరోజు సూర్యాపేట మార్కెట్‌కు 235 క్వింటాళ్ల కంది పంట రాగా కనిష్ట ధర రూ. 3,069 పలికింది. గరిష్ట ధర రూ.3,929 పలికింది. అదే మార్కెట్లో 11న 156 క్వింటాళ్ల కంది రాగా.. కనిష్టంగా రూ.3,129, గరిష్టంగా రూ.3,843 ధర పలికింది. 13న వరంగల్‌ మార్కెట్‌కు 14 క్వింటాళ్ల కంది రాగా.. కనిష్ట ధర రూ.3,685, గరిష్ట ధర 3,789 మాత్రమే పలికింది. అదేనెల 14న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు కనిష్టంగా రూ.2,100, గరిష్టంగా రూ.3,800 దక్కింది.

కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఏది?
కేంద్రం రాష్ట్రంలో కందిని ఎంఎస్‌పీకి కొనుగోలు చేయాలని సూచించింది. అయితే ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఎన్ని ప్రారంభించాలన్న దానిపైనా స్పష్టత రాలేదు. గతేడాది 98 కంది కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ ప్రారంభించింది. వాటి ద్వారా రికార్డు స్థాయిలో రూ.1,030 కోట్ల విలువైన 2.04 లక్షల టన్నుల కందిని కొనుగోలు చేసింది. మొత్తం 2.03 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటికే మార్క్‌ఫెడ్‌ను కంది కొనుగోలుకు నోడల్‌ ఏజెన్సీగా నియమించారు. త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తేనే రైతులకు ప్రయోజనం ఉంటుంది. లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది.

పెద్ద నోట్ల రద్దు ఓ కారణం
ఈసారి దేశవ్యాప్తంగా పప్పుధాన్యాల ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం అదే తీరు కొనసాగుతోంది. మున్ముందు ఇలాగే ఉండనుంది. ఉత్పత్తి తగ్గినా డిమాండ్‌ పెరగకపోవడానికి పెద్ద నోట్ల రద్దు ఒక కారణంగా కనిపిస్తుంది. వ్యాపారుల వద్ద గతంలో మాదిరి నగదు చేతిలో లేదు. దీంతో ఎక్కువ పరిమాణంలో కందిని కొనుగోలు చేయడం లేదు. ఇతర పంటల పరిస్థితి అలాగే ఉంది. కేంద్రం కందికి ప్రకటించిన ఎంఎస్‌పీ రూ.5,450 కాగా.. మార్కెట్లో రూ.4 వేల కంటే తక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కదలాలి. రైతుల నుంచి కందిని కొనుగోలు చేయాలి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు లేఖ రాశాను.     – పార్థసారథి, వ్యవసాయ శాఖ కార్యదర్శి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top