కింద పెద్దవాగు.. పైన కాకతీయ కాలువ..

Kakatiya Canal Aqueduct is a Showcase of Engineering Talent - Sakshi

ఇంజినీర్ల శ్రమకు గుర్తింపుగా నిలుస్తున్న అక్విడెక్ట్‌

అద్భుతమైన నిర్మాణాన్ని పూర్తి చేసిన ఇంజినీర్లు

మోర్తాడ్‌(బాల్కొండ): ప్రకృతి అందించిన పెద్దవాగు ప్రవాహానికి బ్రేక్‌ పడకుండా కాకతీయ కాలువ ద్వారా నీటి తరలింపునకు ఆటంకం లేకుండా అక్విడెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఇంజినీర్ల శ్రమ ఎంతో గొప్పది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదల చేసే నీటి తరలింపు కోసం తొర్తి, వెంచిర్యాల్‌ మధ్యలో ఉన్న పెద్దవాగుపై అక్విడెక్ట్‌ను నిర్మించారు. కింద పెద్దవాగు, పైన కాకతీయ కాలువ చూడడానికి ఇదో అద్భుతంగా ఉంటుంది. ఇంజినీర్ల ప్రతిభకు అద్దంపట్టే అక్విడెక్ట్‌ను శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే పూర్తిచేశారు. వర్షాకాలంలో పెద్దవాగు, కాకతీయ కాల్వలు రెండు ప్రవహించే సమయంలో పర్యాటకులను ఈ అక్విడెక్ట్‌ ఎంతో ఆకర్షిస్తుంది. డంగు సున్నం, కంకర, ఇనుము తది తర సామగ్రిని వినియోగించి అక్విడెక్ట్‌ను పూర్తి చేశారు.

కాకతీయ కాలువ ద్వారా విడుదల చేసే నీటి ప్రవాహానికి అక్విడెక్ట్‌ తట్టుకుని ఉండే విధంగా లీకేజీలను ఏర్పాటు చేశారు. లీకేజీల వల్ల పెద్దవాగులో జలకళ సంతరించుకుని సా గునీటి సమస్యను కొంత మేర తీరుస్తుంది. నీటి తరలింపునకే కాకుండా రవాణాకు ఉపయోగపడే విధంగా అక్విడెక్ట్‌ను నిర్మించారు. అక్విడెక్ట్‌ కు రెండువైపులా వాహనాలు వెళ్లే విధంగా మా ర్గం ఉంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారికి అక్విడెక్ట్‌ను దాటడం సులభంగానే ఉంది. అక్విడెక్ట్‌కు చిన్న చిన్న మరమ్మతులు అవసరం ఉన్నాయి. అయితే అక్విడెక్ట్‌ నిర్మించి ఐదు దశాబ్దాలు దాటినా ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉండడంతో అప్పటి ఇంజినీర్ల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుందని చెప్పవచ్చు.

టెక్నాలజీ తోడవడంతో అద్భుత ఆవిష్కరణలు
దేశ ప్రగతిలో ఇంజినీర్ల పాత్ర చాలాకీలకం. శాస్త్ర, సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, ఇంజినీరింగ్‌ రంగానికి తోడు కావడంతో సాగునీటి ప్రాజెక్టుల ఆవిష్కరణలో ఆద్భుత ఫలితాలు సాధించుకుంటున్నాం. గోదావరి నదిపై చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయడంలోనే తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. ఇంజినీరింగ్‌ రంగంలో అద్భుత ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి.   – మధుకర్‌ రెడ్డి, ఈఈ నీటిపారుల శాఖ ప్రాజెక్టు డివిజన్, బోధన్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top