జస్టిస్‌ పీసీ రావు కన్నుమూత

Justice PC Rao passed away - Sakshi

అనారోగ్యంతో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన న్యాయకోవిదుడు

ఆదివారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు..

సాక్షి, హైదరాబాద్‌: న్యాయకోవిదుడు, పద్మభూషణ్‌ జస్టిస్‌ పాటిబండ్ల చంద్రశేఖరరావు (82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జస్టిస్‌ పీసీ రావుకు భార్య, నలుగురు కుమార్తెలున్నారు. ఆయన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌.82లో నివాసముండేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామంలో ఆయన 1936 ఏప్రిల్‌ 22న జన్మించారు. మద్రాస్‌ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, బీఎల్, ఎంఎల్, ఎల్‌ఎల్‌డీ (డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌) పట్టాలు, హైదరాబాద్‌ నల్సార్‌ వర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందారు. రాజ్యాంగపరమైన అంశాల్లో బాగా లోతుగా అధ్యయనం చేసి ఆయన తనదైన ముద్ర వేశారు. ఆర్బిట్రేషన్‌ లా (మధ్యవర్తిత్వ న్యాయ), అంతర్జాతీయ సముద్ర జలాల న్యాయ వివాదాలు తదితర చట్టాల్లో ఆరితేరిన వ్యక్తిగా పేరొందారు. దేశం తరఫున అంతర్జాతీయ జల చట్టాల పరిశోధనాధికారిగా కూడా పనిచేశారు. భారత ప్రభుత్వ న్యాయశాఖ, డిప్యూటీ లెజిస్ట్రేటివ్‌ కౌన్సిల్‌లో అదనపు కార్యదర్శి, కార్యదర్శితో సహా పలు ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలను ఆయన చేపట్టారు.

2017 వరకు ‘ట్రిబ్యునల్‌’ న్యాయమూర్తిగా..
హంబర్గ్‌లోని అంతర్జాతీయ సముద్ర జల వివాదాల ట్రిబ్యునల్‌ అధ్యక్షుడిగా (1999 నుంచి 2002 వరకు), న్యాయమూర్తిగా 2017 వరకు జస్టిస్‌ పీసీ రావు పనిచేశారు. ఇటలీ–చైనా సముద్ర జలాల వివాదాలపై 1996 నుంచి మధ్యవర్తిగా వ్యవహరించారు. భారత ప్రధానులుగా చేసిన ఐదుగురితో కలసి పనిచేశారు. రాజ్యాంగ అంశాలపై సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. స్థానిక సంస్థలు, మానవహక్కులు, న్యాయపరమైన పలు రాజ్యాంగ సవరణలు తీసుకురావడంలో జస్టిస్‌ పీసీ రావు సేవలున్నాయి. రాజ్యాంగ అంశాలపైనే కాకుండా మధ్యవర్తిత్వం, అంతర్జాతీయ చట్టాలపై అనేక పుస్తకాలు రాశారు. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌తో సత్కరించింది. జస్టిస్‌ పీసీ రావు మరణ వార్త తెలియగానే సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఢిల్లీ నుంచి ఫోన్‌ చేసి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ జస్టిస్‌ పీసీ రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అమెరికా నుంచి కుమార్తెలు వచ్చాక ఆదివారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జస్టిస్‌ పీసీ రావు అంత్యక్రియలు జరుగనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top