ప్రభుత్వం మాట తప్పింది 

Justice Chandrakumar comments on government - Sakshi

     రైతుల సమస్యలు పరిష్కరించలేదు: జస్టిస్‌ చంద్రకుమార్‌

     కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి: సారంపల్లి మల్లారెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: రైతుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన మాటను తప్పిందని హైకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో వాస్తవ సాగు దారుల హక్కులపై సోమవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షిత కౌలు రైతు చట్టానికి తెలంగాణ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే  ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 30 శాతం మంది కౌలు రైతులు సేద్యం చేస్తున్నారని, వారు ఆత్మహత్యలు చేసుకుంటే  నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. 2011 సాగుదారుల చట్టం ప్రకారం వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.  

భూ సంస్కరణలు అమలు చేయాలి: వరవరరావు 
రైతులను ఆదుకోవటం ప్రభుత్వ కనీస బాధ్యత అని, ఆ బాధ్యతను కూడా నెరవేర్చడం లేదని విరసం నేత వరవరరావు విమర్శించారు. గత ప్రభుత్వాల విధానాలనే టీఆర్‌ఎస్‌ అవలంభిస్తుందని ఎద్దేవా చేశారు. రైతు స్వరాజ్యవేదిక నాయకుడు విస్సా కిరణ్‌ మాట్లాడుతూ..  కౌలు రైతులు ఈ సదస్సు నిర్దేశించిన నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలన్నారు.  సదస్సు లో సీపీఎం రాష్ట్ర నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి, పశ్య పద్మ, టి.సాగర్, సాయన్న,  వీరన్న, అచ్యుత రామారావు  పాల్గొన్నారు.  

కౌలు రైతుల మిస్డ్‌ కాల్‌ కాంపెయిన్‌.. 
 కేసీఆర్‌  రాష్ట్రంలో కౌలు రైతులు ఎక్కడ? అని అడుగుతున్నారు కాబట్టి, కౌలు రైతులందరూ మిస్డ్‌ కాల్‌ కాంపెయిన్‌లో పాల్గొనాలని సదస్సు పిలుపునిచ్చింది. 040–39560444కి మిస్డ్‌ కాల్‌ ఇచ్చి మీరు కౌలు రైతు అని తెల పాలని పిలుపునిచ్చారు.  కౌలు రైతుల సమస్యల కోసం 8500983300 నంబర్‌ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు  నిర్వాహకులు ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top