నేటి నుంచి జేఈఈ మెయిన్‌ హాల్‌టికెట్లు 

JEE Main Hall Tickets from today - Sakshi

జనవరి 6 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు 

తెలంగాణ నుంచి 70 వేల మంది హాజరు 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, ఇతర జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం జనవరి 6 నుంచి 20 వరకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ ప్రవేశపరీక్షకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనిలో భాగంగా విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసునేందుకు (jeemain.nic.in) చర్యలు చేపట్టింది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు సంబంధించిన లింక్‌ను ఈ నెల 17 (సోమవారం) నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో ప్రతి రోజు రెండు షిఫ్ట్‌లుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 264 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 9.65 లక్షల మంది హాజరుకానుండగా, అందులో తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది హాజరుకానున్నారు. తెలంగాణ విద్యార్థుల కోసం హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్‌ పట్టణాల్లో ఎన్‌టీఏ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఏటా ఒకసారి మాత్రమే జేఈఈ మెయిన్‌ను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహించగా, 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఎన్‌టీఏ ఏటా రెండుసార్లు నిర్వహించేలా షెడ్యూలు జారీ చేసింది. దీనిలో భాగంగా మొదటి విడత పరీక్షను జనవరిలో, రెండో విడత పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది.  

గంట ముందుగానే కేంద్రంలోకి.. 
మొదటి విడత పరీక్షను జనవరి 6 నుంచి 20 వరకు నిర్వహించనుంది. ఆయా తేదీల్లో ప్రతి రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి షిఫ్ట్‌ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో షిఫ్ట్‌ పరీక్ష ఉంటుంది. విద్యార్థులను రెండు గంటల ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందేనని ఎన్‌టీఏ తెలిపింది. ఉదయం పరీక్షకు 8:30 లోపు, మధ్యాహ్నం పరీక్షకు 1:30 లోపు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందేనని పేర్కొంది.

ఆ తరువాత విద్యార్థులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఉదయం పరీక్షకు 8:45 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1:45 నుంచి 2 గంటల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష హాలు/ గదిలోకి అనుమతిస్తామని పేర్కొంది. విద్యార్థులకు కేటాయించిన కేంద్రంలోనే పరీక్ష రాయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రం మార్పు ఉండదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. విద్యార్థులు తప్పుడు సమాచారం ఇచ్చినా, ఒక షిఫ్ట్‌కు బదులు రెండు షిఫ్ట్‌లలో లేదా వేర్వేరు రోజుల్లో రెండుసార్లు పరీక్ష రాస్తే వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని, వారి ఫలితాలను పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top