ఇల్లు కంటే.. జైలే పదిలం!

Jail Better Than Holes Because Of Negligence In Cleanliness - Sakshi

పెరోల్‌ ప్రతిపాదనపై జైలు అధికారుల అనాసక్తి

సాక్షి, హైదరాబాద్‌: ఇల్లు కంటే జైలే పదిలం. తెలంగాణ జైళ్లశాఖ అధికారులు, ఖైదీల కుటుంబ సభ్యుల మనోగతమిది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌  నేపథ్యంలో జైలులో కొత్తవారు ఎవరూ లోనికి రాకపోవడం, బయటి వారెవరూ లోపలికి వెళ్లకపోవడం వంటి అంశాలు జైల్లోని ఖైదీలకు సానుకూల అంశాలేనని పోలీసులు ఉన్నతాధికారులు భావి స్తున్నారు. కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్యంపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే అన్ని రకాల ములాఖత్‌లు రద్దు చేశారు. ఒకరకమైన ప్రత్యేక కవచంలో ఖైదీలంతా భద్రంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జైలు ఇల్లులా మారింది. ఇంకా లోతుగా చెప్పాలంటే.. ఇంటి కంటే కూడా జైలే భద్రమన్న భావన ఇటు జైలు అధికారుల్లోనూ, అటు ఖైదీల్లోనూ నెలకొంది. దేశవ్యాప్తంగా హెల్త్‌ ఎమర్జెన్సీ విధించి జన సంచారంపై కఠిన ఆంక్షలు విధించారు. ప్రజా, ప్రైవేటు రవాణా నిలిపివేయడంతో జనజీవనం స్తంభించింది. రద్దీగా ఉండే జైళ్లలో ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో హోంమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, జైళ్ల శాఖ డీజీ, అన్ని జైళ్ల సూపరింటెండెంట్‌లు సభ్యులుగా ఉంటారు.

నివేదికపై కసరత్తు.. 
ఈ నివేదికపై ఉన్నతస్థాయి కమిటీ కసరత్తు ప్రారంభించింది. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నా రు. ఉత్తర భారత్‌లో జైళ్లలో ఖైదీల సంఖ్య అధికం. అందుకే, అక్కడ రద్దీ ఆధారంగా కొందరికి పెరోల్‌ మంజూరు చేసే అవకాశాలు లేకపోలేదు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పెరోల్‌పై విడుదల చేసే వారి జాబితాను దాదాపుగా సిద్ధం చేసింది. అందులో ఏడేళ్లలోపు శిక్ష పడినవారు, సత్ప్రవర్తన కలిగిన వారు ఉన్నారని సమాచారం. అయితే  ఖైదీల్లో నూటికి 99% బీదవారే. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాల వారూ ఉన్నారు. ఇపుడు వీరికి పెరో ల్‌ ఇచ్చినా.. ప్రజారవాణా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల ఖైదీలు వెళ్లడం ప్రశ్నార్థకంగా మారుతుం దని, కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీరు జైల్లో ఉండటమే మంచిదని పలువురు జైళ్లశాఖ సీనియర్‌ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నివేదికలో మన ఉన్నతస్థాయి కమిటీ ఏయే విషయాలు ప్రస్తావిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top