ఏం జరుగుతోంది..?

Irregularities In Peddapalli Education Department - Sakshi

పెద్దపల్లి  విద్యాశాఖలో  వరుస  ఘటనలు

మొన్న రామగుండం ప్రిన్సిపాల్‌పై  కలెక్టర్‌కు ఫిర్యాదు

సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్‌) : పెద్దపల్లి విద్యాశాఖ వరుస ఘటనలతో సంచలనంగా మారుతోంది. నెలన్నర క్రితం రామగుండం కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపాల్‌ వేధిస్తోందంటూ ఇద్దరు విద్యార్థులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఇప్పటికీ ఈ విషయమై చర్యలు కానరాలేదు. వారంక్రితం విద్యార్థికి టీసీ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ రామగిరి మండలం బేగంపేట ప్రధానోపాధ్యాయురాలు ఏసీబీకి పట్టుపడింది. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగి రమేశ్‌ అదృశ్యమయ్యాడు. వరుస ఘటనలతో జిల్లా విద్యాశాఖలో ఏం జరుగుతోందనే విషయం చర్చనీయాంశంగా మారింది.

విద్యాశాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఓ మహిళా అధికారి తనను వేధిస్తోందని సర్వశిక్ష అభియాన్‌ విభాగంలో డీఎల్‌ఎంటీగా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌ మూడుపేజీల లేఖరాసి అదృశ్యం అయ్యాడు. ఉద్యోగి రాసిన లేఖలో ప్రస్తావించిన విషయాలు విద్యాశాఖ అధికారులను విస్మయానికి గురిచేశాయి. జీఎస్‌డీవో వల్ల అన్యాయం లేఖలో జరిగిందని ఆరోపించాడు.

సెక్టోరల్‌ అధికారిగా ఉత్తర్వులు..
డీఎల్‌ఎంటీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రమేష్‌ తనను సెక్టోరల్‌ అధికారిగా నియమించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు.రాష్ట్ర విద్యాశాఖ అధికారులను సైతం కలిసి తన విన్నపాన్ని తెలియపర్చాడు. వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగివై ఉండి ఇక్కడి వరకు ఎలా వచ్చావంటూ అవమానిం చారని సన్నిహితుల వద్ద వాపోయాడు. అయినప్పటికీ తన ప్రయత్నాలు కొనసాగించాడు. అయితే ఇటీవల ఉద్యోగవిరమణ పొందిన డీఈ ఓ గత ఏడు నెలల క్రితం సెక్టోరల్‌ అధికారిగా రమేశ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 

ఏడు నెలలుగా విబేధాలు..
రమేష్‌ సెక్టోరల్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఆ స్థానంలో ఉన్నతాధికారులు మరొకరిని నియమించారు. తనపై కోపంతోనే జీసీడీవో పరపతిని ఉపయోగించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తన పోస్టును వేరొకరికి ఇప్పించిందని సన్నిహితుల వద్ద రమేష్‌ వాపోయాడు. బిల్లుల మంజూరు విషయంలో అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు లేఖలో పేర్కొన్నాడు.

మహిళా అధికారిపై తీవ్ర ఆరోపణలు..
రమేష్‌ అదృశ్యమవడానికి ముందు రాసిన లేఖలో ఉన్నతాధికారులతో మహిళా అధికారి చనువుగా ఉంటోందని ఆరోపించాడు. ఆ కారణంగానే తనకు సెక్టోరల్‌ పోస్టు రాకుండా అడ్డుపడిందని తెలిపాడు. రాష్ట్ర విద్యాశాఖలో పనిచేస్తున్న ఏఎస్‌పీడీ, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌లు తనను అవమానించడం సైతం ఆవేదనకు గురిచేసినట్లు రాశాడు.

అయోమయంలో అధికారులు..
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగి అదృశ్యం కావడంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన అందరిలో నెలకొంది. రమేష్‌ అదృశ్యం మిస్టరీ ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..
నేను నెలన్నర క్రితమే బాధ్యతలు చేపట్టా. నావద్ద పూర్తి సమాచారం లేదు. మిస్సింగ్‌ తర్వాతే నాకు విషయం తెలిసింది. రమేష్‌ రాసిన లేఖలోని అంశాలపై ఆర్జేడి దృష్టికి తీసుకెళ్తా. అధికారులు ఇచ్చే ఉత్తర్వుల మేరకు చర్యలు ఉంటాయి. రమేష్‌ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటన్నా. 
– జగన్మోహన్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి, పెద్దపల్లి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top