సాక్షి, కరీంనగర్: కరీంనగర్ టూ టౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జమ్మికుంట మండలం సీతంపేటలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. భార్య మృతి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఎస్‌ఐ.. అత్తగారి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడటం సంచలనం రేపుతోంది. దివ్య మృతిపై అనుమానాలు తలెత్తడంతో చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు.
కాగా, కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్యకు 2016లో ఎస్‌ఐ చంద్రశేఖర్‌తో కాగా.. భర్త రోజుమాదిరిగా మంగళవారం(మార్చి, 17) ఇద్దరు పిల్లలను పాఠశాలలో వదిలి డ్యూటీకి వెళ్లాడు. కాగా దివ్య కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో అదేరోజు ఉదయం ఆమె గన్నేరుపూలు, ఆకులు మిక్సీ చేసుకొని తాగిన దివ్య.. తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పింది. దివ్యను ఆమె భర్త.. వెంటనే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
అయితే, దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమంటూ మృతురాలి బంధువులు దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య మృతురాలి తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇవాళ(మార్చి 21, శనివారం) ఐదు రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చిన ఎస్‌ఐ చంద్రశేఖర్.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గదిలో నుండి బయటికి రాకపోవడంతో అనుమానంతో చూడగా ఉరి వేసుకొని ఉండడంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.


