తాండూరు రూరల్: మహిళ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న వడ్డీ వ్యాపారిని ఎందుకు అరెస్టు చేయలేదని ఎస్పీ స్నేహ మెహ్ర కరన్‌కోట్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమో దు చేసి ఏడు రోజులు అవుతున్నా పురోగతి లేకపోవడంపై మండిపడ్డారు. శుక్రవారం బాధిత కుటుంబసభ్యులు వికారాబాద్‌లో ఎస్పీని కలిపి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం సిరిగిరిపేట్‌కు చెందిన అగ్గనూర్ వీరప్ప, లక్ష్మి దంపతులు.
వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి హన్మంత్‌రెడ్డి వద్ద వీరప్ప ఏడాది క్రితం వ్యవసాయ పనుల కోసం రూ.లక్ష అప్పు తీసుకున్నారు. పంట దెబ్బతినడంతో తీర్చలేదు. ఈ నెల 13న వడ్డీ వ్యాపారి హన్మంత్‌రెడ్డి.. వీరప్ప ఇంటికి వెళ్లి అతని భార్య లక్ష్మితో దురుసుగా ప్రవర్తించాడు. మనస్తాపం చెందిన ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు మృతురాలి భర్త వీరప్ప కరన్‌కోట్‌పీఎస్‌లో హన్మంత్‌రెడ్డి, ఉమాదేవిపై ఫిర్యాదు చేశాడు.
కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆమె కరన్‌కోట్ పోలీసులకు ఫోన్ చేసి నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మంత్‌రెడ్డి ఇంటికి తాళం వేసి వెళ్లాడని, ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని ఎస్‌ఐ వినోథ్ రాథోడ్ వివరణ ఇచ్చారు. అధికార పారీ్టకి చెందిన ఓ నేత నిందితులను కాపాడుతున్నట్లు బాధిత కుటుంబం ఆరోపించింది.


