‘కాగ్నా’ వద్ద ఇసుక మంటలు | Sakshi
Sakshi News home page

‘కాగ్నా’ వద్ద ఇసుక మంటలు

Published Fri, Dec 21 2018 1:35 AM

Interstate border dispute between Telangana and Karnataka - Sakshi

బషీరాబాద్‌: కాగ్నా నది వద్ద తెలంగాణ– కర్ణాటక మధ్య అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం తారస్థాయికి చేరింది. నదిలో వాటాలు తేల్చకుండానే పొరుగు రాష్ట్రం అధికారులు ఇసుక తవ్వకాలు చేపట్టడం ఇందుకు కారణమైంది. రెండు రాష్ట్రాల సరిహద్దు పంచాయితీ తేల్చకుండానే గురువారం కర్ణాటక ప్రభుత్వం పోలీసు బందోబస్తు మధ్య ఇసుక తవ్వకాలు చేపట్టింది. తమ భూ భాగంలోనే ఇసుక తవ్వకాలు జరుపుతోందని, ఎవరైనా అడ్డుçకుంటే అరెస్టు చేస్తామని కర్ణాటక పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయం తెలియగానే బషీరాబాద్‌ తహసీల్దార్‌ ఉమామహేశ్వరి, ఎస్‌.ఐ. మహిపాల్‌రెడ్డి తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో సుళ్‌లైపేట్‌ ఎస్‌ఐ రాజశేఖర్, బషీరాబాద్‌ తహసీల్దార్‌ ఉమామహేశ్వరితో వాగ్వాదానికి దిగారు. ముందుకు వస్తే అరెస్టు చేస్తామని తహసీల్దార్‌ను హెచ్చరించారు. దీంతో బషీరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఇలా ఇరు రాష్ట్రాల పోలీసులు ఘర్షణకు దిగారు.  

కన్నడ పోలీసులపై  తిరగబడిన క్యాద్గిరా రైతులు 
మరోవైపు క్యాద్గిరా రైతులు కూడా ఒక్కసారిగా కన్నడ పోలీసులపై తిరగబడ్డారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. సరిహద్దులపై ఉమ్మడి సర్వేకు అంగీకరించిన కన్నడ అధికారులు ఏకపక్షంగా సర్వే చేసి హద్దులు ఎలా నిర్ణయిస్తారని తహసీల్దార్‌ అక్కడి అధికారులపై మండిపడ్డారు. తెలంగాణ భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చి తమపైనే జులుం ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. కన్నడ అధికారుల దుందుడుకు చర్యలపై తహసీల్దార్‌ వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌లో సమాచారం చేరవేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌రావ్, డీఎస్పీ రామచంద్రుడు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మరోవైపు కర్ణాటక ఉన్నతాధికారులు సైతం అక్కడికి వచ్చారు. సేడం రెవెన్యూ అసిస్టెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ సుశీల, చించొళ్లీ ›తహసీల్దార్‌ బీరేధర్, సుళ్‌లైపేట్‌ సీఐ కట్టిమణి కాగ్నాకు వచ్చి సరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ అధికారులు పూర్తి ఆధారాలు లేకుండా అడ్డుకోవడం మంచిది కాదని అసిస్టెంట్‌ కమిషనర్‌ సుశీల హెచ్చరించారు. తాము కూడా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతోనే అడ్డుకున్నామని ఇక్కడి అధికారులు తెలిపారు. ఎంతకీ పంచాయితీ తేలకపోవడంతో వివాదాన్ని ఇరు రాష్ట్రాల జిల్లా కలెక్టర్ల కోర్టులోకి పడేశారు. 

నేడు వికారాబాద్, గుల్బర్గా  జిల్లాల కలెక్టర్ల భేటీ... 
తెలంగాణ –కర్ణాటక అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాన్ని తేల్చడానికి వికారాబాద్, గుల్బర్గా జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగారు. వికారాబాద్‌ కలెక్టర్‌ ఉమర్‌ జలీల్‌ కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా కలెక్టర్‌ పి.వెంకటేశ్‌కుమార్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. ఇరువర్గాల అధికారులను వెనక్కి పంపించారు. సరిహద్దు సమస్య తీవ్రరూపం దాల్చడంతో దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఇరువురు కలెక్టర్లు ఏకాభి ప్రాయానికి వచ్చారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాద్గిరా దగ్గర కాగ్నాలో భేటీ కావాలని నిర్ణయించారు. ఉమ్మడి రెవెన్యూ రికార్డులను పరిశీలించి ఉమ్మడి సర్వే చేయడానికి ఏర్పాట్లు చేయాలని సరిహద్దు ప్రాంతాల్లోని తమతమ అధికారులకు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశారు. బషీరాబాద్‌ రెవెన్యూ అధికారులు గురువారం సాయంత్రం వికారాబాద్‌లో కలెక్టర్‌ను కలసి నివేదిక అందజేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement