జానారెడ్డి, షబ్బీర్‌ అలీకి ఇంటెలిజెన్స్‌ నోటీసులు

Intelligence notices from Janareddy, Shabir Ali - Sakshi

ఎన్నికల కోడ్‌ సమయంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు వినియోగం 

ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు 9లక్షలు చెల్లించాలన్న ఐఎస్‌డబ్ల్యూ 

టీఆర్‌ఎస్‌ నేతలకూ చెల్లింపు నోటీసులిచ్చినట్టు చెప్పిన అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలైన జానారెడ్డి, షబ్బీర్‌ అలీకి ఇంటెలిజెన్స్‌ పోలీసులు నోటీసులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల వినియోగంపై రోజువారీ అద్దె, డ్రైవర్‌ భత్యం కింద రూ.9 లక్షలు చెల్లించాలని జానారెడ్డితో పాటు షబ్బీర్‌ అలీకి రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌(ఐఎస్‌డబ్ల్యూ)విభాగం శనివారం నోటీసులందించింది. 2007లో సీఈసీ ఆదేశాల ప్రకారం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో భద్రత నిమిత్తం బుల్లెట్‌ ప్రూఫ్‌వాహనాలు సమకూర్చుకున్న నేతలు తప్పనిసరిగా సంబంధిత వాహనాల అద్దెతో పాటు డ్రైవర్లకు భత్యం చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాల్లో ఉందని, ఈమేరకు బుల్లెట్‌ వాహనాలు వినియోగించినవారందరికీ నోటీసులు పంపించినట్టు ఇంటెలిజెన్స్‌ అధికారులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన సెప్టెంబర్‌ 6 నుంచి డిసెంబర్‌ 7వరకు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు టీఎస్‌ 09పీఏ1653, టీఎస్‌ 09పీఏ1654 వాహనాలు ఉపయోగించారని నోటీసుల్లో పేర్కొన్నారు. షబ్బీర్‌ అలీ ఈ కోడ్‌ కాలంలో 12,728 కి.మీ వాహనంలో ప్రయాణించారని, ఇందుకు గాను ప్రతీ కిలోమీటర్‌కు రూ.37లతో పాటు డ్రైవర్‌ భత్యం రోజు వారీరూ.100లతో కలిపి మొత్తంగా రూ.4,79,936  చెల్లించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్, మాజీ మంత్రి జానారెడ్డి కోడ్‌ అమల్లో ఉండగా 11,152 కి.మీలు ప్రయాణించారని, ఇందుకు గాను రూ.4,20,924 చెల్లించాలని పేర్కొన్నారు. ఇద్దరు నేతలు కలిపి మొత్తంగా రూ.9,00,860 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.  

అధికార పార్టీకి సైతం 
రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో ఉన్న మంత్రులు, ఇతర వీఐపీలు వాడిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలకు సైతం ఇదే రీతిలో చెల్లించాలని ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ అధికారులు నోటీసులిచ్చినట్టు తెలిసింది. ఎవరెవరికి ఇచ్చారు? ఎంత చెల్లించాల్సి ఉంటుందన్న అంశాలపై సాక్షి ఆరాతీసేందుకు ప్రయత్నించగా సంబంధిత అధికారులెవరు అందుబాటులోకి రాలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top